హైదరాబాద్ : హైదరాబాద్ రన్నర్స్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మెరుగైన ఫిట్నెస్, ఏకాగత్ర, మానసిక సంసిద్ధత సాధించాలన్న తపనతో కొంత మంది అథ్లెట్లు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. మామూలుగా ఒక రోజు 21కి.మీలు పరుగెత్తడం సాధారణం. కానీ వరుసగా 21 రోజుల పాటు ప్రతీ రోజు 21కి.మీల పరిగెత్తడం మామూలు విషయం కాదు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు కొందరు. 21 రోజుల వరకే పరిమితం కాకుండా కొంత మంది ఏకంగా 100 రోజుల పాటు పరుగు ప్రయాణాన్ని కొనసాగించడం విశేషం. ఈ అలుపెరుగని ఫీట్లో హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ ద్విబాష్యం, జగన్మోహన్రెడ్డి, మురళీ కరణం, విజయ్‌భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
ఈ అరుదైన ఫీట్‌పై శ్రవణ్ స్పందిస్తూ ‘ప్రతీ రోజు పరిగెత్తడం వలన గాయాలు అవుతాయన్న వాదనను బ్రేక్ చేసేందుకు ఈ చాలెంజ్ ఎంచుకున్నాను. సరైన విశ్రాంతికి తోడు రికవరీ, ఆహారం మనల్ని శక్తివంతులను చేస్తుంది. నేనైతే ఎలాంటి ప్రత్యేక ఆహారం తీసుకోకుండా, కేవలం ఇంట్లో వండిన వాటినే తీసుకున్నాను. దీని ద్వారా నన్ను నేను పరీక్ష చేసుకోవడంతో పాటు స్ఫూర్తి కల్గించుకునేందుకు ఉపయోగపడింది’ అని చెప్పుకొచ్చాడు. మరోవైపు 50 ఏండ్ల ఫిజియో ఫిట్నెస్ సలహాదారు జగన్మోహన్రెడ్డి ప్రతీ రోజు 21కి.మీలు పరిగెత్తుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.