ఫార్ములా రేసింగ్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ నగర నడిబొడ్డున కార్లు రయ్య్ మంటూ దూసుకెళ్లే సమయం ఆసన్నమైంది. నగర వాసులకు కొత్త అనుభూతి అందించేందుకు ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) అన్ని హంగులు అద్దుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్‌పై జాతీయ, అంతర్జాతీయ రేసర్లు టాప్‌గేర్‌లో దూసుకెళ్లేందుకు సై అంటున్నారు. ఆరు ప్రధాన నగరాల సమాహారంగా ఐపీఎల్ తరహాలో ఐఆర్ఎల్ అరంగేట్రం సీజన్‌కు శనివారం తెరలేవబోతున్నది. దేశంలో తొలిసారి జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక రేసింగ్ లీగ్‌లో హైదరాబాద్ తరఫున అనిందిత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సొంతగడ్డపై సత్తాచాటేందుకు సై అంటున్న అనిందిత్తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
దేశంలో తొలిసారి జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్ హైదరాబాద్‌లో జరుగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే పుట్టి, పెరిగిన తాను రేసింగ్‌లో పోటీపడేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. లీగ్ సన్నాహాల్లో భాగంగా చెన్నైలో ప్రి సీజన్ టెస్టు జరిగింది. 1980,90 దశకాల్లో మన దగ్గర రేసింగ్ లీగ్‌లు జరిగినా..ఈ మధ్య కాలంలో ఫార్ములా రేసులు జరుగడం ఇదే తొలిసారి. భారత్‌లో మొదటిసారి జరుగుతున్న లీగ్‌కు హైదరాబాద్ వేదిక కావడం గర్వించదగ్గ విషయం.
ఫార్ములా రేసింగ్ అభిమానులకు శుభవార్త. రేసింగ్‌ను అమితంగా ప్రేమించే ఫ్యాన్స్‌కు ఇక పండుగే పండుగ. కనురెప్పపాటులో రివ్వున దూసుకుపోయే రేసింగ్ కార్లు నగర నడిబొడ్డున తళుక్కున మెరిసేందుకు సిద్ధమయ్యాయి. శని, ఆదివారాల్లో హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి సీజన్ జరుగనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఫిబ్రవరిలో జరిగే ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్‌కు ట్రయల్‌గా భావిస్తున్న ఐఆర్‌ఎల్‌లో ఆరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మొత్తం 2.7కిలోమీటర్ల ట్రాక్‌పై పోటీకి రేసర్లు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. లీగ్‌లో మొత్తం ఆరు జట్ల తరఫున 24 మంది రేసర్లు పోటీలో ఉన్నారు. ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టులో అనిందిత్రెడ్డితో పాటు అఖిల్ రవీంద్ర, నీల్ జనీ, లోలా లవీన్స్ఫోస్(మహిళా రేసర్) ఉన్నారు. అపార అంతర్జాతీయ అనుభవమున్న అనిందిత్ హైదరాబాద్‌కు కీలకంగా మారనున్నాడు. సహచర రేసర్లు అఖిత్, నీల్ జనీతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు.
బ్లాక్‌బర్డ్స్ విజయవకాశాలు ఎలా ఉన్నాయి?
లీగ్‌లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే హైదరాబాద్ పటిష్ఠంగా ఉంది. అనుభవజ్ఞడైన నీల్ జనీతో పాటు అఖిల్ రవీంద్ర మన జట్టులో ఉండటం సానుకూలాంశం. లీగ్‌లో మనకు గోవా ఏసెస్, గాడ్స్పీడ్ కొచ్చి జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది. స్విట్జర్లాండ్‌కు చెందిన నీల్జనీకి ఫార్ములా రేసింగ్‌లో అపార అనుభవముంది. ఇది జట్టుకు ఎంతో ఉపయోగపడనుంది.
రేసింగ్ ఎలా ఉండబోతుంది?
కొత్తగా నిర్మిస్తున్న హైదరాబాద్ ట్రాక్‌పై రేసు రసవత్తరంగా సాగే అవకాశముంది. మొత్తం 17 మలుపులతో నిర్మించిన ట్రాక్ రేసర్లకు పరీక్ష పెట్టనుంది. లీగ్‌లో ఒక్కో జట్టుకు ఇద్దరేసి డ్రైవర్ల చొప్పున మొత్తం 12 మంది పోటీకి దిగుతారు. శనివారం క్వాలిఫికేషన్‌తో పాటు రేసు జరుగుతుంది. ఆదివారం ప్రధాన రేసుతో మొత్తం మూడు రౌండ్ల పోటీలు జరుగుతాయి. ఇలా నాలుగు వారాల్లో హైదరాబాద్, చెన్నై వేదికలుగా 12 రేసులు జరుగుతాయి. 40 నిమిషాల పాటు జరిగే రేసులో పిట్‌స్టాప్స్ ఉంటాయి.
పాయింట్లు ఎలా ఇస్తారు?
రేసులో అగ్రస్థానంలో నిలిచే డ్రైవర్‌కు 25 పాయింట్లు, రెండో స్థానానికి 18 పాయింట్లు, మూడుకు 15, నాలుగుకు 12, ఐదుకు 10 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. 12 రేసులు ముగిసేసరికి పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచే డ్రైవర్‌కు చాంపియన్‌షిప్ లభిస్తుంది. హైదరాబాద్‌లో నవంబర్ 19, 20తేదీలో పాటు ముగింపు లీగ్ డిసెంబర్ 10, 11 ఇక్కడే జరుగుతుంది. మిగిలిన రెండు రేసులు చెన్నైలో నవంబర్ 25, 27, డిసెంబర్ 2, 4 తేదీల్లో జరుగుతాయి.
కారు ప్రత్యేకతలు ఏంటీ?
ఇండియన్ రేసింగ్ లీగ్ కోసం ఇటలీకి చెందిన కార్ల తయారీ సంస్థ వోల్ఫ్ రేసింగ్ బృందం వీటిని తయారు చేసింది. పోటీ సమానంగా ఉండేందుకు నిర్వాహకులు అన్ని జట్లకు ఒకే రకమైన కార్లను అందుబాటులోకి తెచ్చారు. 370 కిలోల బరువుండే కారు గంటకు అత్యుత్తమంగా 250కి.మీ వేగంతో దూసుకెళుతుంది. దీన్నుంచి వచ్చే సౌండ్ బాగుంటుంది.
ఫార్ములా రేసింగ్‌లో మీ కెరీర్?
ఫార్ములా రేసింగ్‌లో పదేండ్ల ప్రొఫెషనల్ అనుభవముంది. ట్రాక్‌పై మరో ఐదేండ్లు పోటీపడ్డ ఎక్స్పీరెన్స్ ఉంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 70కి పైగా పోడియం ఫినిష్‌లు, ఐదు చాంపియన్‌షిప్‌లు ఉన్నాయి. పిన్న వయసు నుంచే ఆసక్తితో రేసింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను. కెరీర్లో ఏదో ఒక రోజు లెమో రేసు(24 గంటల పాటు నిర్విరామంగా)ను పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నాను. ఇండియన్ రేసింగ్ లీగ్ ద్వారా భవిష్యత్‌లో మరింత మంది ప్రతిభ కల్గిన రేసర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది.