Akashdeep-Monica | భారత హాకీ జట్టు స్టార్ ప్లేయర్, ఒలింపియన్ ఆకాశ్‌దీప్ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. వధువు ఎవరో కాదు.. హాకీ క్రీడాకారిణి మోనిక. ఇద్దరూ హాకీ ప్లేయర్స్ పెళ్లితో ఒకటికానున్నారు. లూథియానా హైవేలోని ఓ క్లబ్లో వీరిద్దరి నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. మోనికా స్వస్థలం హర్యానా సోనిపట్‌లోని గోహనా. ఆకాష్దీప్ సింగ్ పంజాబ్ టార్న్ తరణ్ జిల్లా ఖదూర్ సాహిబ్ పరిధిలోని విరోవల్ గ్రామస్తుడు. వీరిద్దరి పెళ్లి ఈ నెల 15న జరుగనున్నది. మొహాలిలోని లాంద్రా-సిర్హింద్ హైవేపై ఉన్న ప్రైవేట్ రిసార్ట్ వివాహ వేడుకకు ముస్తాబైంది. పెళ్లి కార్యక్రమానికి పలువురు ప్రముఖ క్రీడాకారులతో పాటు అధికారులు హాజరవనున్నారు. ఆకాశ్‌దీప్ సింగ్ పంజాబ్ పోలీస్ విభాగంలో ఇటీవల డీఎస్పీగా నియామకమైన విషయం తెలిసిందే. గతేడాది పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆకాశ్‌దీప్ సింగ్‌ను డీఎస్పీగా నియమించారు.
కాగా, మోనికా మాలిక్ భారతీయ రైల్వేలో పని చేస్తున్నది. ఆకాశ్‌దీప్ సింగ్ జట్టు ఫార్వర్డ్ లైన్ ఆటగాడు. అతని సోదరుడు ప్రభదీప్ సింగ్ సైతం భారత హాకీ జట్టులో కొనసాగాడు. ఖాదూర్ సాహిబ్‌లోని బాబా గురుముఖ్ సింగ్ బాబా ఉత్తమ్ సింగ్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఆకాష్దీప్ సింగ్ పాఠశాల స్థాయిలో గేమ్స్ ఆడడం ప్రారంభించాడు. ఆ తర్వాత 2006లో గురు అంగద్ దేవ్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి లూథియానాలోని పీఏయూ హాకీ అకాడమీకి మారాడు. అనంతరం జలంధర్‌లోని సుర్జిత్ హాకీ అకాడమీలో చేరాడు. ఆకాశ్‌దీప్ 2011లో జూనియర్ నేషనల్ టీమ్‌కి కెప్టెన్‌గా సేవలందించాడు. 2012లో ఢిల్లీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు. మెల్బోర్న్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆగస్టు 2020లో ఆకాశ్‌దీప్ సింగ్‌కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది.