ODI World Cup 2023 | క్రికెట్‌ను మతంగా, సచిన్ టెండూల్కర్‌ను దేవుడిగా.. కోట్లాది మంది భావించే మన దేశంలో ఈ ఫొటో.. తీవ్ర కలకలం రేపింది.
ఎన్నో ఏండ్ల తపన.. అంతకుమించిన తపస్సు.. ఆపై దైవానుగ్రహం ఉంటే తప్ప దక్కని వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడాలని యావత్ క్రీడాలోకం ఉవ్విళ్లూరుతుంటే.. సర్వశక్తులు ఒడ్డి సాధించుకున్న విశ్వ కిరీటానికి ఇంతటి అవమానమా!
జగజ్జేత అనే బిరుదు కోసం ఏకంగా ఆరుసార్లు క్రికెట్ ప్రపంచకప్ ఆడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్ చరమాంకంలో ఆ కప్పును అపురూపంగా ముద్దాడిన ఘడియలు కండ్ల ముందు మెదులుతుంటే!
కెరీర్ ఆసాంతం ఫిఫా ట్రోఫీ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అర్జెంటీనా స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన అనంతరం నిద్రలోనూ కప్పునే తడుముకుంటూ పడుకున్న చిత్రాలు మదిలో ముద్రించుకుపోతే..!
అంతటి మెగా కప్పుకు కనీసం గౌరవం ఇవ్వకుండా.. ఆస్ట్రేలియా ఆటగాడు మిషెల్ మార్ష్ చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది!!
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : జీవితంలో ఒక్కసారైన విశ్వ విజేత అనిపించుకోవాలని.. ఆ బిరుదు దక్కితే అదే మహాభాగ్యం అనుకునే కోట్లాది మంది ఉన్న మన దేశంలో.. ఆస్ట్రేలియా పేస్ ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ చేసిన హేయమైన చర్య క్రీడాలోకాన్ని ఆగ్రహానికి గురిచేసింది. ప్రపంచకప్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో పది జట్లు 45 రోజుల పాటు సుదీర్ఘంగా పోరాడితే.. దాన్ని సాధించిన గంటల వ్యవధిలోనే ఆసీస్ ఆటగాళ్లు తమ బుద్ధి చూపెట్టుకున్నారు. సంబురాల్లో భాగంగా.. డ్రెస్సింగ్ రూమ్‌లో మిషెల్ మార్ష్ కప్పుపై కాళ్లు పెట్టి చేతిలో బీరు బాటిల్‌తో సేద తీరుతున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దీన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. క్షణాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచకప్ నెగ్గిన ఆస్ట్రేలియాకు.. ఆ కప్పుకు సముచిత గౌరవం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం అభిమానులను కలచివేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా మనవాళ్లు మార్ష్‌ను తులనాడుతున్నారు!
రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన సచిన్ టెండూల్కర్ 2011లో తొలిసారి ప్రపంచకప్ చేజిక్కించుకున్నాడు. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్.. ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ సిక్సర్‌తో జట్టును గెలిపించిన అనంతరం చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన విషయం క్రీడాభిమానులు అంత తొందరగా మరిచిపోరు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చేతికి అందిన విశ్వ కిరీటాన్ని సచిన్ ఆప్యాయంగా ముద్దాడిన క్షణం యావత్ భారతం పులకించిపోయింది. ఆ ట్రోఫీని మాస్టర్ అపురూపంగా తడమడాన్ని ప్రతీ భారతీయుడు హృదయాంతరాల్లో ఆస్వాదించాడు.
క్లబ్‌ల తరఫున లెక్క లేనన్ని ట్రోఫీలు సాధించిన అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పరిస్థితి కూడా దాదాపు ఇదే.. తన కెరీర్ చివరి అంకంలో అతడు ఫిఫా ప్రపంచకప్ ముద్దాడాడు. 2022 వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌తో జరిగిన తుదిపోరులో అద్వితీయ ఆటతీరుతో జట్టును జగజ్జేతగా నిలిపిన అనంతరం మెస్సీ అపురూపంగా ఫిఫా ట్రోఫీని ముద్దాడటం చూసిన క్షణాన చలించిపోని సాకర్ అభిమాని లేడు. ఇక ఫైనల్ ముగిసిన అనంతరం మెస్సీ తన హోటల్ రూమ్‌లో కప్పుపై ప్రేమగా చేయి వేసి నిద్రిస్తున్న ఫొటో అప్పట్లో వైరల్‌గా మారిన విషయం విదితదే. ఏ క్రీడలోనైనా మనం కష్టపడి సాధించుకున్న దానికి విలువ ఇవ్వడం ఓ ప్లేయర్ నైతిక బాధ్యత.. కానీ.. ఆస్ట్రేలియా మాత్రం అందుకు అతీతం. 2015లో విశ్వ విజేతగా నిలిచిన అనంతరం ఎనిమిదేండ్ల తర్వాత దక్కిన కప్పుపై ఇలా కాళ్లు పెట్టి సంబురాలు జరుపుకోవడాన్ని మరి కంగారూలు ఎలా సమర్థించుకుంటారో?