రోహతక్: హర్యానా రంజీ జట్టు బౌలర్ అన్షుల్ కాంబోజ్(Anshul Kamboj).. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. రంజీ చరిత్రలో పది వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా అన్షుల్ కాంబోజ్ నిలిచాడు. 23 ఏళ్ల కాంబోజ్ రోహతక్‌లోని చౌదరీబన్సీలాల్ స్టేడియంలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డు నెలకొల్పాడు. అతను 30.1 ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో కాంబోజ్.. ముంబై ఇండియన్స్‌కు ఆడాడు.
రంజీ క్రికెట్లో ఇప్పటి వరకు మరో ఇద్దరు బౌలర్లు ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసుకున్నవారిలో ఉన్నారు. బెంగాల్‌కు చెందిన ప్రమగ్షు ఛటర్జీ 1956లో అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు, రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ సుందరం 1985లో విదర్భతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు తీసుకున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పది వికెట్లు తీసిన ఆరవ ఇండియన్ బౌలర్‌గా కాంబోజ్ నిలిచాడు. అనిల్ కుంబ్లే, సుభాష్ గుప్తే, దేబశిశ్ మోహంతి కూడా ఈ లిస్టులో ఉన్నారు.
కాంబోజ్ బౌలింగ్ ధాటికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేరళ 291 రన్స్‌కే ఆలౌటైంది. కేవలం 19 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లోనే కాంబోజ్ 50 వికెట్లు మైలురాయిని చేరుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీని హర్యానా గెలవడంతో కాంబోజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అతను 10 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు.