ఢిల్లీ: జపాన్‌లోని ఐచి-నగోయా ఆతిథ్యమివ్వనున్న ఆసియా గేమ్స్‌లో క్రీడాకారులకు జీవితకాలం గుర్తుండిపోయే వసతి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. మెగా క్రీడలంటే గుర్తుకువచ్చే సంప్రదాయక ‘క్రీడా గ్రామాల’కు భిన్నంగా ఈసారి ఆటగాళ్లకు సముద్రంలో విలాసవంతమైన భారీ నౌకలో సముద్రుడి అలలను వీక్షిస్తూ ఉల్లాసంగా గడిపే అనుభూతి దక్కనున్నది. ఆటగాళ్లు బస చేసే ఆ భారీ నౌక పేరే ‘కోస్టా సెరెనా’. నీటిలో తేలియాడే (ఫ్లోటింగ్) క్రీడాగ్రామంగా ఇది వారికి చిరకాల స్మృతులను పంచనున్నది. ఆసియా క్రీడలు ఈనెల 19న మొదలవ్వాల్సి ఉండగా క్రీడాకారుల కంటే ముందే ఈ నావ.. ఈ నెల14న నగోయ తీరానికి రానున్నది.
ఎందుకిది?
సాధారణంగా ఇలాంటి క్రీడల కోసం క్రీడా గ్రామాలను నిర్మించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒకసారి ఆ గేమ్స్ ముగిశాక వాటిని ఖాళీగా వదిలేయాల్సిందే. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఈ ఫ్లోటింగ్ విలేజ్ ఐడియాకు ఓటేశారు. నగోయ నగరం సముద్రపు ఒడ్డున ఉండటం వారికి కలిసొచ్చింది.
అందరికా?
ఆసియా క్రీడల్లో అథ్లెట్లు, వారి సహాయక సిబ్బంది, ఇతరత్రా కలిసి 17 వేల మంది దాకా పాల్గొంటారని అంచనా. అయితే నగోయలో జరిగే క్రీడలకు మాత్రమే (సుమారు ఐదు వేల మందికి) సెరెనాను ఉపయోగించనున్నారు. ఐచి, టోక్యోలో జరిగే ఈవెంట్లలో అక్కడి సమీపంలో ఉండే హోటళ్లలో క్రీడాకారులకు బస ఏర్పాటుచేశారు.
ఏంటి కోస్టా సెరెనా?
ఇది ఒక ఇటాలియన్ నౌక. 2004లో దీని నిర్మాణానికి పూనుకోగా 2006లో పూర్తై 2007 నుంచి సేవలందిస్తున్నది. రెండు దశాబ్దాల చరిత్ర కల్గిన ఈ నౌకలో 14 ఫ్లోర్లు ఉన్నాయి. సుమారు 5 వేల మంది ఉండగలిగే ఈ షిప్పులో 557 బాల్కనీలు, 10 బార్లు, 8 రెస్టారెంట్లు, ఏడు స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో ఉన్నాయి.