Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. మాజీ వరల్డ్ నంబర్ 1 మగురుజకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. బెల్జియం క్రీడాకారిణి ఎలిసె మెర్టెన్స్ తన అద్వితీయమైన ఆటతో మాజీ ప్రపంచ ఛాంపియన్‌కు చెక్ పెట్టింది. 26వ సీడెడ్ఎలిసె చేతిలో 6-3, 6-7(3-7), 1-6తో మగురుజ ఓటమి పాలైంది. మగురుజ పెద్దగా కష్టపడకుండానే మొదటి సెట్ గెలిచింది. అయితే.. రెండో సెట్ నుంచి ఎలెస్ పుంజుకుంది.
రెండున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మరో మ్యాచ్‌లో 4వ సీడ్ కరోలిన్ గర్సియా (ఫ్రాన్స్) రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. కెనడాకు చెందిన క్యాథెరిన్ సెబోవ్‌పై 6-3 6-0తో విజయం సాధించింది. స్పెయిన్‌కు చెందిన మగురుజ ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. 2016లో సెరీనా విలియమ్స్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీ అందుకుంది. 2017లో వీనస్ విలియమ్స్‌ను చిత్తు చేసి వింబుల్డన్ ట్రోఫీ నెగ్గింది. 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సోఫియా కెనిన్ చేతిలో మగురుజ ఓడిపోయింది.