ఈ టోర్నీలో రాణించడం నాకు చాలా ముఖ్యం. ఇక్కడ పోటీ ఎంత కఠినంగా ఉంటుందో అందరికీ తెలుసు. కేవలం టాప్-8 లోకి రావడమే ఇక్కడ పెద్ద సవాలు. నేను నా ట్రెయినింగ్, ప్రాసెస్ మీదే దృష్టి పెట్టాను, అది వర్కౌట్ అయింది. ఫైనల్లో నా ఎడమ చేయి వణుకుతున్నట్లు అనిపించింది. ఒత్తిడి అనేది ఈ ఆటలో సహజం, దాన్ని ఎదుర్కొని ముందుకు సాగడమే అనుభవం నేర్పే పాఠం.
– ఇషా సింగ్
మ్యూనిచ్ (జర్మనీ): భారత షూటింగ్ సంచలనం, తెలంగాణ బిడ్డ ఇషా సింగ్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డులతో మెరిసింది. ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్/పిస్టల్ ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో బంగారు పతకం గెలవడమే కాకుండా.. ఒకే దెబ్బకు అటు సీనియర్, ఇటు జూనియర్ విభాగాల్లో ప్రపంచ రికార్డులను తిరగరాసింది.
8 మంది ప్రపంచ మేటి షూటర్లు తలపడిన ఫైనల్లో 21 ఏండ్ల ఇషా సింగ్ ఆరంభం నుంచే విశ్వరూపం ప్రదర్శించింది. మొత్తం 10 సిరీస్‌ల (సిరీస్‌కు 5 షాట్లు) పోరులో 5 సిరీస్‌ల్లో ఐదుకు ఐదు పర్ఫెక్ట్ హిట్స్ సాధించి ప్రత్యర్థులను వెనక్కి నెట్టేసింది. మొత్తం 43 హిట్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
ఈ క్రమంలో రెండేండ్ల క్రితం బాకులో కొరియా షూటర్ కిమ్ యేజీ నెలకొల్పిన సీనియర్ ప్రపంచ రికార్డును (42 హిట్స్) బద్దలు కొట్టింది. అలాగే కొరియాకే చెందిన యాంగ్ జియిన్ పేరిట ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును (41 హిట్స్) కూడా అధిగమించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడిప్పుడే సీనియర్ లెవెల్‌తో రాణిస్తున్న ఇషా కెరీర్లో ఇది నాలుగో వ్యక్తిగత ప్రపంచకప్ పతకం.
జర్మనీ వెటరన్ షూటర్ డోరీన్ వెన్నెకాంప్ (38)రజతం, బల్గేరియా షూటర్ మిరోస్లావా (31) కాంస్యం గెలిచారు. ఇదే ఈవెంట్లో బరిలో నిలిచిన భారత స్టార్ షూటర్లు మను భాకర్ (582 పాయింట్లు), రాహి సర్నోబాత్ (581 పాయింట్లు) క్వాలిఫయింగ్ రౌండ్లలో వరుసగా 12, 14 స్థానాల్లో నిలిచి ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నారు. మరోవైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో ఆషి చౌక్సే 589 పాయింట్లు సాధించి కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె ఓవరాల్‌గా 12వ స్థానంలోనిలిచింది.