కొలంబో : శ్రీలంక పర్యటనలో అదరగొడుతున్న యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (193 బంతుల్లో 12 ఫోర్లతో 117) సిరీస్‌లో వరుసగా రెండో శతకం బాదగా రెండో టెస్టులో తొలిరోజే భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఆదివారం నుంచి మొదలైన రెండో టెస్టులో పడిక్కల్ శతక ధమాకాతో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీ, యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 9 ఫోర్లతో 45), రవీంద్ర జడేజా (83 బంతుల్లో 4 ఫోర్లతో 43) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో (3/46) మూడు వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు మంచి ఆరంభమే దక్కింది. గాలెలో విఫలమైన జైస్వాల్.. కొలంబోలో మాత్రం వన్డే తరహా ఆట ఆడాడు. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో కూడిన వాతావరణంలో గతితప్పిన లంక బౌలర్లను బౌండరీలతో శిక్షించాడు. ఫోర్‌తోనే ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అతడు.. లాహిరు ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. మరో ఎండ్‌లో రాహుల్ సైతం నిలకడగానే ఆడుతూ ప్రభాత్ జయసూర్య విసిరిన రెండో ఓవర్లో స్ట్రెయిట్ సిక్స్‌తో అలరించాడు. కానీ లాహిరు వేసిన 11వ ఓవర్లో.. కీపర్ డిక్వెలాకు క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ నిష్క్రమించినా జైస్వాల్ దూకుడు తగ్గలేదు. ఫెర్నాండో వేసిన 17వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన అతడు.. ఆఖరి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
గాలె టెస్టుతో జట్టులో తన విలువను చాటిచెప్పే ఇన్నింగ్స్ ఆడిన పడిక్కల్.. కొలంబోలోనూ అదే ఆటతో టీమ్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేలా సత్తాచాటాడు. కెరీర్లో నాలుగో టెస్టు ఆడుతున్న అతడు.. వ్యక్తిగత స్కోరు 0, 1 వద్ద ఉండగా లంక ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడవంతో వచ్చిన అవకాశాన్ని రెండుచేతులా సద్వినియోగం చేసుకున్నాడు. జైస్వాల్ ఔట్ అయ్యాక పడిక్కల్, గిల్ ద్వయం ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించింది. లంక సారథి ధనంజయ పదే పదే బౌలర్లను మార్చుతూ ఇరువైపులా దాడి చేయించినా ఈ జోడీ అనవసరపు షాట్లకు పోకుండా నిలకడగా ఆడింది. 88/2తో భోజన విరామానికి వెళ్లొచ్చిన టీమిండియా.. ఆ తర్వాత క్రమంగా ఈ జోడీ జోరు పెంచడంతో స్వేచ్ఛగా పరుగులు రాబట్టింది. 90 బంతుల్లో పడిక్కల్, 99 బంతుల్లో గిల్ అర్ధ శతకాలు పూర్తయ్యాయి. అయితే టీ విరామానికి ముందు అసిత.. గిల్‌ను ఔట్ చేసి పర్యాటక జట్టును మరోసారి దెబ్బకొట్టాడు. గిల్, పడిక్కల్ మూడో వికెట్‌కు 120 రన్స్ జోడించారు. 2019లో పుజారా-రహానే (111) తర్వాత మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నమోదవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

గిల్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్ పంత్ (3)కు లాహిరు ఓవర్లో వేసిన షాట్‌బాల్ అతడి చేతికి బలంగా తాకడంతో అసౌకర్యానికి గురై రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిపోయాడు. దీంతో జట్టును గట్టెక్కించే బాధ్యతను భుజానికెత్తుకున్న పడిక్కల్.. జడేజాతో కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. జడ్డూ అండతో శతకం దిశగా సాగిన ఈ కర్నాటక కుర్రాడు.. డ్రింక్స్ విరామం తర్వాత ప్రభాత్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదాడు. ఆఖరి బంతిని లాంగాన్ దిశగా పంపి ఈ సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సందర్భంగా 2019 తర్వాత భారత్ ఆవల టెస్టు ఆడుతూ మూడో స్థానంలో వరుసగా రెండు శతకాలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 2019లో పుజారా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. శతకం తర్వాత పడిక్కల్.. నువాంత బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. పడిక్కల్, జడ్డూ ఐదో వికెట్‌కు 74 రన్స్ జతచేశారు. 80వ ఓవర్ అనంతరం కొత్తబంతిని తీసుకున్న లంక.. ఆఖర్లో జడేజానూ ఔట్ చేసి భారత్‌ను దెబ్బకొట్టింది. అయితే ధృవ్ జురెల్ (7 బ్యాటింగ్), ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన సారాన్ష్ జైన్ (4 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా చూసుకున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 85 ఓవర్లకు 300/5 (పడిక్కల్ 117, గిల్ 50, అసిత 3/36, లాహిరు 1/38)