Paris Olympics | ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్ పోరాటం ముగిసింది. పతకాలు గెలుస్తారన్న అంచనాల మధ్య పోటీకి దిగిన వెటరన్ ఆర్చర్ దీపికా కుమారితో పాటు యువ ఆర్చర్ భజన్‌కౌర్ విఫలమయ్యారు. శనివారం తొలుత జరిగిన మహిళల వ్యక్తిగత ప్రిక్వార్టర్స్‌లో దీపిక 6-4తో జర్మనీకి చెందిన క్రాపెన్పై అద్భుత విజయం సాధించింది.
తొలి సెట్ నుంచే అద్భుత ప్రదర్శన కనబరుస్తూ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. జర్మనీ ఆర్చర్‌కు ఎక్కడా అవకాశమివ్వకుండా కచ్చితమైన గురితో ఆకట్టుకుంది. అయితే క్వార్టర్స్‌లో మాత్రం ఫలితం రివర్స్ అయ్యింది. కొరియా ఆర్చర్ సుహ్యాన్ నామ్ చేతిలో 6-4తో దీపిక ఓటమిపాలైంది.
తొలి సెట్(28)తో పాటు మూడో సెట్(29)ను దక్కించుకున్న దీపికాకు వరుసగా నాలుగు, ఐదు సెట్లలో నామ్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఒక దశలో 4-2 ఆధిక్యం కనబరిచిన దీపిక..షాట్లలో తడబాటుతో మూల్యం చెల్లించుకుంది. దీంతో మరోమారు ఒలింపిక్స్ నుంచి ఉత్త చేతులతో దీపిక ప్రస్థానం ముగిసింది. మరోవైపు యువ ఆర్చర్ భజన్‌కౌర్ ప్రిక్వార్టర్స్‌లో5-6తో దియానంద చొరోనిసియా(ఇండోనేషియా) చేతిలో పోరాడి ఓడింది.
ఐదు సెట్ల పోరు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటాఫ్‌లో భజన్‌కు ఐదు పాయింట్లు రాగా, దియానంద ఆరు పాయింట్లతో విజయం సాధించింది. మొత్తంగా పారిస్ ఒలింపిక్స్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బొమ్మదేవర ధీరజ్, అంకితా భకత్ కాంస్య పతక పోరు మెరుగైన ప్రదర్శనగా నమోదైంది.