SA vs BAN | ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 23వ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. ఆదిలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయినా ఓపెనర్ క్వింటన్ డికాక్‌తో పాటు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ లు సఫారీ స్కోరుబోర్డును నడిపిస్తున్నారు. 20 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ దక్షిణాఫ్రికా.. రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. డికాక్ (60 బ్యాటింగ్) , మార్క్రమ్ (26 బ్యాటింగ్) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్థ సెంచరీలతో కదం తొక్కిన రీజా హెండ్రిక్స్‌తో పాటు రస్సీ వాన్ డెర్ డసెన్‌లు నేటి మ్యాచ్‌లో విఫలమయ్యారు.
ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ తిరిగిరాగా.. బవుమా ఇంకా కోలుకోలేకపోవడంతో మార్క్రమ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికాకు ఏడో ఓవర్లోనే తొలి షాక్ తాకింది. 19 బంతులాడిన హెండ్రిక్స్.. 12 పరుగులే చేసి షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ స్థానంలో వచ్చిన డసెన్ కూడా ఏడు బంతులలో ఒక పరుగే చేసి విఫలమయ్యాడు. 36కే రెండు కీలక వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికాను డికాక్‌తో పాటు మార్క్రమ్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ సఫారీలకు మరో భారీ స్కోరు అందించే దిశగా నడిపిస్తున్నారు.