AUS vs PAK | పాకిస్తాన్ ఎప్పటిలాగే..! ఒత్తిడికి చిత్తైన బాబర్ గ్యాంగ్.. ఆస్ట్రేలియాకు రెండో విజయం
AUS vs PAK | ఎప్పుడెలా ఆడతారో తెలియని పాకిస్తాన్ క్రికెట్ ఎప్పటిలాగే కీలక మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు కల్పించుకుని మరి ఒత్తిడికి తట్టుకోలేక చిత్తైంది. హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆసీస్ నే విజయం వరించింది.
AUS vs PAK | గెలిచే మ్యాచ్‌లో ఓడటం.. ఓడే మ్యాచ్‌లో గెలవడం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య. ఎప్పుడెలా ఆడతారో తెలియని పాకిస్తాన్ ఎప్పటిలాగే కీలక మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు కల్పించుకుని మరీ ఒత్తిడికి తట్టుకోలేక చిత్తైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 368 పరుగుల లక్ష్య ఛేదనలో అదిరిపోయే ఆరంభం దక్కినా మిడిలార్డర్ వైఫల్యంతో పాకిస్తాన్ మరో ఓటమిని మూటగట్టుకుంది. భారీ ఛేదనలో 45.3 ఓవర్లలో 305 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్ లో కంగారూలు.. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి ఈ మెగా టోర్నీలో రెండో విజయాన్నిఅందుకున్నారు. పాక్‌కు ఇది నాలుగు మ్యాచ్‌లలో రెండో ఓటమి.
భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు శుభారంభమే దక్కింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (61 బంతుల్లో 64, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హక్ (71 బంతుల్లో 70, 10 ఫోర్లు) ధాటిగా ఆడారు. ఈ ఇద్దరూ 21.1 ఓవర్లలోనే తొలి వికెట్ కు 134 పరుగులు జోడించారు. స్టార్క్‌తో పాటు మ్యాక్స్‌వెల్, కమిన్స్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కున్న ఈ ఇద్దరూ అర్థ సెంచరీలతో పాకిస్తాన్ ఛేదనను ఘనంగా ఆరంభించారు.
అయితే సాఫీగా సాగుతున్న పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కు మార్కస్ స్టోయినిస్ షాకిచ్చాడు. స్టోయినిస్ వేసిన 21వ ఓవర్లో తొలి బంతికే షఫీక్.. భారీ షాట్ ఆడబోయి మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. స్టోయినిస్ తన తర్వాతి ఓవర్లో పాక్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఇమామ్ ఉల్ హక్ ను పెవలియన్‌కు పంపాడు. ఫ్లాట్ పిచ్ అయిన చిన్నస్వామిలో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే ఇటువంటి పిచ్‌లు అంటే ఇష్టపడే బాబర్ ఆజమ్ నేటి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 14 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 18 పరుగులు చేసిన బాబర్‌ను స్పిన్నర్ ఆడమ్ జంపా.. 26వ ఓవర్లో రెండో బంతికి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
బాబర్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్ (31 బంతుల్లో 30, 5 ఫోర్లు)తో కలిసి వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్ స్కోరుబోర్డును పరుగులుపెట్టించాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 57 పరుగులు జోడించారు. కమిన్స్, స్టోయినిస్ బౌలింగ్‌లో అలవోకగా పరుగులు రాబట్టిన ఈ ఇద్దరూ పాకిస్తాన్‌ను విజయం వైపు నడిపించారు.
షకీల్ ఔట్.. పాకిస్తాన్ ఖతం..
గెలుపు దిశగా సాగుతున్న పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కు కమిన్స్ భారీ షాకిచ్చాడు. 34 ఓవర్లలో 231-3గా ఉన్న పాకిస్తాన్ స్కోరు.. 40 ఓవర్లు వచ్చేసరికి 274-6గా మారింది. ఐదు ఓవర్లలో మూడు కీలక వికెట్లను కోల్పోయింది. కమిన్స్ వేసిన 34వ ఓవర్లో రెండో బంతికి షకీల్.. స్టోయినిస్ చేతికి చిక్కాడు. అతడే వేసిన 36వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన ఇఫ్తికార్ అహ్మద్ (20 బంతుల్లో 26, 3 సిక్సర్లు) జంపా వేసిన 38వ ఓవర్ ఐదో బంతికి ఎల్బీగా నిష్క్రమించాడు. ఇఫ్తికార్, షకీల్ నిష్క్రమించినా పాకిస్తాన్ భారీ ఆశలు పెట్టుకున్న రిజ్వాన్నూ జంపా పెవిలియన్ చేర్చాడు. 40వ ఓవర్లో ఐదో బంతికి రిజ్వాన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక హెజిల్వుడ్ వేసిన 41వ ఓవర్ ఐదో బంతికి ఉసామా మిర్.. స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఒకదశలో నిర్ణీత ఓవర్ల కంటే ముందే విజయం సాధిస్తుందనుకున్న పాక్.. చివరికి 305 పరుగులకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది. పాక్ లోయరార్డర్‌ను కంగారూలు ఎక్కువసేపు నిలవనీయలేదు. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు కీలక వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. కమిన్స్, స్టోయినిస్ తలా రెండు వికెట్లు తీయగా.. స్టార్క్, హెజిల్వుడ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

