చెన్నై: హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్-19 సీజన్‌ను ఆరంభించినా ఆ తర్వాత క్రమంగా పుంజుకుని వరుస విజయాలతో అదరగొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మరో గెలుపుతో ప్లేఆఫ్స్ రేసును రసవత్తరంగా మార్చేసింది. సొంతగడ్డపై ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ సేన.. ప్రత్యర్థిని 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. లక్నో నిర్దేశించిన 204 పరుగుల ఛేదనలో ఉర్విల్ పటేల్ (23 బంతుల్లో 65, 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెపాక్‌లో లక్నో బౌలర్లపై పిడుగులా విరుచుకుపడటంతో ఛేదనను ఆ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది.
రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 42, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. జోష్ ఇంగ్లిస్ (33 బంతుల్లో 85, 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులకు తోడు షాబాజ్ అహ్మద్ (25 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 203/8 స్కోరు చేసింది. కాగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై 12 పాయింట్లతో ఐదో స్థానానికి చేరగా 8 పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో జట్టు అధికారికంగా నిష్క్రమించింది.
1, 6, 6, 6, 6, 6, 4, 6, 1, 0, 6, 1, 1.. రికార్డు ఛేదనలో సీఎస్కే యువ సంచలనం ఉర్విల్ విధ్వంసం అది! 13 బంతుల్లోనే అర్ధశతకంతో లక్నో బౌలర్లను చెడుగుడు ఆడుకుని సీఎస్కేను గెలుపు రేసులోకి తీసుకురావడంలో అతడిదే కీలకపాత్ర. క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా సంజూ శాంసన్ (14 బంతుల్లో 28, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ ధాటిగా ఆడటంతో సీఎస్కే 4 ఓవర్లకే 47/1తో ఛేదనను ధాటిగానే ప్రారంభించింది. సంజూ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చాడు ఉర్విల్. ఎదుర్కున్న రెండో బంతి నుంచే అతడి విధ్వంసం మొదలైంది. హ్యాట్రిక్ సిక్స్‌లతో అవేశ్ ఖాన్‌ను శిక్షించిన ఈ గుజరాత్ కుర్రాడు.. దిగ్వేశ్ ఓవర్లో విధ్వంసాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. ఈ ఇద్దరి ఓవర్లలో చెన్నై ఏకంగా 50 పరుగులు పిండుకోవడంతో పవర్‌ప్లేలో ఆ జట్టు 97/1తో నిలిచింది.
షమీ ఓవర్లో ఆఖరి బంతిని పాయింట్ వైపుగా తరలించి సింగిల్‌తో ఫిఫ్టీ పూర్తిచేసిన ఉర్విల్.. ఈ లీగ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన జైస్వాల్‌తో సంయుక్తంగా నిలిచాడు. ఫిఫ్టీ అయ్యాక అతడు జేబులోంచి ‘దిస్ ఈజ్ ఫర్ యూ పప్పా’ అని రాసి ఉన్న చిట్టీని ప్రదర్శించాడు. దూకుడుగా ఆడే క్రమంలో షాబాజ్ విసిరిన పదో ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన అతడు.. ఎక్స్ట్రా కవర్ వద్ద అవేశ్‌కు క్యాచ్ ఇవ్వడంతో లక్నో ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
చెన్నై ఇన్నింగ్స్ 3.5 వద్ద క్రీజులోకి వచ్చినప్పుడు ఆ జట్టు స్కోరు 45/1 ఉండగా ఉర్విల్ నిష్క్రమించే (9.2 ఓవర్లకు) సమయానికి 126/2తో తిరుగులేని స్థితిలో నిలిచింది. 34 బంతుల వ్యవధిలో రుతురాజ్‌తో కలిసి అతడు 81 రన్స్ జోడించగా అందులో చెన్నై సారథి చేసినవి 16 రన్స్ మాత్రమే. ఉర్విల్ ఔట్ అయ్యాక రుతురాజ్, కార్తీక్ (20), బ్రెవిస్ (10) కూడా నిష్క్రమించడంతో చెన్నై కాస్త ఆందోళనకు గురైంది. చివరి 3 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 30 రన్స్ అవసవరమవగా ప్రశాంత్ వీర్ (18 నాటౌట్), శివమ్ దూబె (15 నాటౌట్) ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా సీఎస్కేను విజయతీరాలకు చేర్చారు.
చెన్నైకి ఉర్విల్ మాదిరిగానే లక్నో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిస్ సైతం ధనాధన్ ఆటతో రెచ్చిపోయాడు. 6, 4, 4తో దంచుడుకు ముహూర్తం పెట్టిన ఈ ఆసీస్ హిట్టర్.. మార్ష్ (10)తో కలిసి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించాడు. ముకేశ్ ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన అతడు.. అకీల్ బౌలింగ్‌లోనూ అదే సీన్ రిపీట్ చేసి 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. అవతలి ఎండ్‌లో మార్ష్ ప్రేక్షక పాత్ర పోషించగా ఇంగ్లిస్ మాత్రం చెన్నై బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.
అన్షుల్ ఓవర్లో మార్ష్ నిష్క్రమించగా పూరన్ (1)ను నూర్ అహ్మద్ ఔట్ చేశాడు. 9 ఓవర్లకు 112/2తో పటిష్టంగానే కనిపించిన లక్నోకు ఒవర్టన్ షాకిచ్చాడు. పదో ఓవర్లో అతడు ఇంగ్లిస్‌తో పాటు పంత్ (15)నూ వెనక్కిపంపడంతో లక్నో స్కోరువేగం నెమ్మదించింది. ఆ తర్వాత స్పిన్నర్లు కట్టడిచేయడంతో 17 ఓవర్లకు 167/6గానే ఉంది. కానీ చివర్లో షాబాజ్ మెరుపులతో ఆ జట్టు ప్రత్యర్థి ఎదుట పోరాడగలిగే లక్ష్యాన్ని ఉంచగలిగింది.
1 ఐపీఎల్లో 13 బంతుల్లోనే అర్ధ శతకం సాధించినవారిలో ఉర్విల్.. జైస్వాల్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
1 ఈ లీగ్ చరిత్రలో ఎదుర్కున్న తొలి 8 బంతుల్లోనే ఆరు సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాటర్ ఉర్విల్.
2 సీఎస్కేకు ఇది రెండో అత్యధిక ఛేదన. గతంలో ఆ జట్టు బెంగళూరుపై 206 పరుగులను రెండుసార్లు ఛేదించింది. అదీగాక 2019 తర్వాత 180+ టార్గెట్‌ను ఛేదించడం చెన్నైకి ఇదే మొదటిసారి.
లక్నో: 20 ఓవర్లకు 203/8 (ఇంగ్లిస్ 85, షాబాజ్ 43*, ఒవర్టన్ 3/36, అన్షుల్ 2/47);
చెన్నై: 19.2 ఓవర్లకు 208/5 (ఉర్విల్ 65, రుతురాజ్ 42, షాబాజ్ 2/30, దిగ్వేశ్ 2/45)
