హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో ఉల్లంఘనల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే ఫోర్జరీ కేసులో పలువురు ఆఫీస్ బేరర్లు జైలు శిక్ష అనుభవిస్తుండగా, తాత్కాలిక అధ్యక్షుడిగా గద్దెనెక్కిన దల్జీత్‌సింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. అసోసియేషన్ రూల్స్‌కు విరుద్ధంగా వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్) నిర్వహణ, 57 క్లబ్‌లపై మళ్లీ నిషేధంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న దల్జీత్‌సింగ్ మరో నిర్వాకానికి తెరతీశాడు.
హెచ్‌సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు హైకోర్టు ఏకసభ్య కమిటీ నియమించినా..తాను మాత్రం అడ్డదారుల్లో అస్మదీయులను అందలం ఎక్కిస్తున్నాడు. ఓవైపు సీఈవో పదవి కోసం ఇంటర్వ్యూలు జరుగుతుండగా, ఇది వరకు తన కుటుంబానికి చెందిన క్లబ్లో ఆఫీస్ బేరర్‌గా పనిచేసిన ఇంతియాజ్ఖాన్ను తాత్కాలిక సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చాడు. అయితే ఇంతియాజ్‌కు సుదీర్ఘ అనుభవం ఉందని పేర్కొన్న దల్జీత్.. తన క్లబ్లో ఆఫీస్ బేరర్ అన్న విషయాన్ని బయటకు పొక్కనీయలేదు.
హెచ్‌సీఏ తాత్కాలిక సీఈవో నియామకం పూర్తిగా అసోసియేషన్ రూల్స్‌కు విరుద్ధమని మాజీ కార్యవర్గ సభ్యుడు చిట్టి శ్రీధర్ పేర్కొన్నాడు. దల్జీత్సింగ్కు చెందిన అమీర్‌పేట, ఖల్సా క్రికెట్ క్లబ్‌లలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన ఇంతియాజ్ఖాన్ను సీఈవో చేసి పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడ్డాడు.