Nandini Agasara | కుటుంబ పోషణకై టీ కొట్టు నడిపే తండ్రి.. ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఇండ్లల్లో పని చేసే తల్లి.. ఇది ఓ యువ అథ్లెట్ కుటుంబ నేపథ్యం. చిన్నప్పటి నుంచి కష్టాలతో సవాసం చేయడమే తెలిసిన ఆ అమ్మాయి..అవరోధాలను దాటడాన్ని అలవాటుగా మార్చుకుంది. కష్టాలను అధిగమించాలనే కసితో హర్డిల్స్‌ను ఎంచుకుని.. అంచలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ఆ అమ్మాయే 19 ఏండ్ల అగసర నందిని. ఇటీవల భువనేశ్వర్ వేదికగా జరిగిన జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన గురుకుల విద్యార్థిని.. ఈ ప్రదర్శనతో ప్రపంచ యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. వచ్చే నెలలో చైనా వేదికగా జరుగనున్న పోటీల కోసం సిద్ధమవుతున్న నందినితో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
అథ్లెటిక్స్‌పై ఆసక్తి ఎలా?
కేంద్రీయ విద్యాలయలో చదువుతున్న సమయంలో రీజినల్ పోటీల్లో నా ప్రదర్శన గమనించిన కోచ్.. జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన శిక్షణ ఇప్పించడంతో జాతీయ స్థాయిలో నిలకడగా రాణించగలుగుతున్నా.
కుటుంబ నేపథ్యం?
పొట్ట కూటి కోసం కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన కుటుంబం మాది. నాన్న యల్లప్ప ఫుట్‌పాత్‌పై టీ కొట్టు పెట్టుకొని జీవనోపాధి పొందుతుంటే.. అమ్మ ఆయమ్మ ఇండ్లల్లో పనికి వెళ్తుంది. నాకు ఇద్దరు తమ్ముళ్లు వాళ్లు చదువుకుంటున్నారు.
ప్రపంచ యూనివర్సిటీ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికపై స్పందన?
ఇటీవల భువనేశ్వర్ వేదికగా జరిగిన జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించా. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం, హెప్టాథ్లాన్‌లో రజత పతకం గెలిచా. దీంతో వరల్డ్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యా. గురుకులాల్లో ఓనమాలు నేర్చుకొని ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ప్రపంచ స్థాయిలో పోటీ పడటం గర్వంగా ఉంది. గురుకులాల నుంచి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికైన తొలి అథ్లెట్ నేనే కావడం బాధ్యత పెంచింది.
ఈ టోర్నీ ఎక్కడ జరుగనుంది?
వచ్చే నెల 28 నుంచి చైనా వేదికగా పోటీలు జరుగనున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నా. సాధారణంగా నేను హర్డిల్స్ ప్రాక్టీస్ చేస్తా.. కానీ ఈ పోటీల్లో హెప్టాథ్లాన్కు ఎంపికవడంతో దానిపై ఎక్కువ దృష్టిపెట్టా. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటడమే నా లక్ష్యం.
జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు?
2018లో అథ్లెటిక్స్ను కెరీర్‌గా ఎంచుకున్నా. గత నాలుగేండ్లలో జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో ఇప్పటి వరకు 29 పతకాలు సాధించా. 100 మీటర్ల హర్డిల్స్‌తో పాటు లాంగ్‌జంప్‌లో ఎక్కువ మెడల్స్ గెలిచా. ఇప్పటి వరకు రెండు సార్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నా.. మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యా. ఈ సారి కచ్చితంగా మెడల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నా.
అటు చదువు, ఇటు అథ్లెటిక్స్ ఎలా?
గురుకుల స్థాయి నుంచే పోటీల్లో పాల్గొంటుండటంతో చదువు, అథ్లెటిక్స్ను బ్యాలన్స్ చేసుకోవడం అలవాటైంది. ఉపాధ్యాయులు, కోచ్‌ల సహకారంతో ముందుకు సాగుతున్నా. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. ఓయూ పీడీ రాజేశ్ సార్.. సహకారం మరవలేనిది. పరీక్షల సమయంలో మాత్రం ప్రాక్టీస్ పక్కనపెట్టి చదువుపై దృష్టి పెడతా.
ప్రాక్టీస్ ఎలా సాగుతున్నది?
ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నా. రోజూ ఉదయం 4 గంటలు, సాయంత్రం 3 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా. శారీరక శ్రమతో కూడిన అథ్లెటిక్స్‌కు ప్రత్యేక డైట్ అవసరం. దీని కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం స్పాన్సర్ల సాయంతోనే శిక్షణ సాగుతున్నది. విదేశాల్లో టోర్నీలకు వెళ్లాలంటే ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రోత్సాహం లభిస్తే మరింత మెరుగ్గా రాణిస్తా
తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నది. వివిధ క్రీడల్లో రాణిస్తున్న వారికి ప్రోత్సహకాలు అందిస్తున్నది. అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో విపరీతమైన పోటీ ఉంటుంది. ఇందులో రాణించాలంటే మెరుగైన శిక్షణతో పాటు ప్రత్యేక సదుపాయాలు అవసరం. వాటి కోసం తగిన ఆర్థిక భరోసా లభిస్తే.. మరింత మెరుగైన ప్రదర్శన చేస్తా. వెన్నుతట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
హెప్టాథ్లాన్ అంటే..
ఏడు క్రీడాంశాల సమాహారాన్ని హెప్టాథ్లాన్ అంటారు. ఇందులో 100 మీటర్ల హర్డిల్స్, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, 200 మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం ఉంటాయి. ఇందులో ఒక్కో దానికి విడిగా పాయింట్లు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి విజేతను నిర్ణయిస్తారు.