ముంబై : ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), ముంబై ఇండియన్స్ మధ్య వాంఖడేలో గురువారం జరిగిన పోరులో సీఎస్కేనే విజయం వరించింది. క్రికెట్ అభిమానులు ‘ఎల్‌క్లాసికో’గా పిలుచుకునే ఈ పోరును చెన్నై మొదట బ్యాట్‌తో తర్వాత బంతితో సత్తాచాటి పూర్తిగా ఏకపక్షంగా మార్చేసింది. సీఎస్కే నిర్దేశించిన 208 పరుగుల ఛేదనలో స్పిన్నర్లు అకీల్ హోసేన్ (4/17) నాలుగు వికెట్ల ప్రదర్శనకు తోడు నూర్ అహ్మద్ (2/23) స్పిన్ మాయాజాలానికి విలవిల్లాడిన ముంబై.. 19 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది. దీంతో103 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ఐదో స్థానానికి ఎగబాకగా, ముంబై ఐదో ఓటమితో ఎనిమిదో స్థానంలో ఉంది. తిలక్ వర్మ (37), సూర్యకుమార్ (36) మినహా మిగిలినవారంతా సింగిల్ డిజట్కే పరిమితమయ్యారు. మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై.. శాంసన్ (54 బంతుల్లో 101 నాటౌట్, 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కడంతో నిర్ణీత ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఘజన్ఫర్ (2/25), అశ్వని (2/37) చెరో రెండు వికెట్లు తీశారు.
11/3. భారీ ఛేదనలో 3 ఓవర్లకు ముంబై స్కోరది. తొలి ఓవర్లోనే అకీల్.. డానిష్‌ను ఔట్ చేసి వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టగా రెండో ఓవర్లో ముకేశ్.. ప్రమాదకర డికాక్ (7)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. తన రెండో ఓవర్లో అకీల్.. నమన్నూ డకౌట్ చేయడంతో ముంబై ఆత్మరక్షణలో పడింది. అప్పట్నుంచి ఆ జట్టు లక్ష్యం దిశగా అడుగులు వేయలేకపోయింది. పవర్ ప్లేలో సూర్య, తిలక్ క్రీజులో ఉన్నా ఆ జట్టు చేసింది 29 పరుగులే. సుమారు 9 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న వీరిద్దరూ పెద్దగా బ్యాట్ ఝుళిపించలేకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. అకీల్ తన రెండో స్పెల్‌కు బౌలింగ్‌కు వచ్చి ముంబై ఓటమిని ఖరారు చేశాడు. అతడు విసిరిన 11వ ఓవర్లో ఐదో బంతికి తిలక్‌ను బోల్తా కొట్టించి 73 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. నూర్ 13వ ఓవర్ వరుస బంతుల్లో హార్ధిక్ (1), రూథర్‌ఫర్డ్‌ను వెనక్కిపంపాడు. అకీల్ తన ఆఖరి ఓవర్లో సూర్యను కూడా ఔట్ చేయడంతో చెన్నై విజయం ఖాయమైంది. ఆ తర్వాత ముంబై బ్యాటర్ల పోరాటం ఆ జట్టు స్కోరుబోర్డును వంద పరుగుల మార్కును దాటించడం కోసమే సాగింది.
ఈ సీజన్‌కు ముందు భారీ అంచనాలతో చెన్నైకి ట్రేడ్ అయి తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమైనా తర్వాత దుమ్మురేపుతున్న చేట (శాంసన్).. ముంబైతో మ్యాచ్‌లోనూ కదం తొక్కి ఈ సీజన్లో రెండో శతకం బాదాడు. మిగిలిన బ్యాటర్లలో ఎవరూ 25 పరుగుల మార్కును దాటకపోయినా సంజూకు అండగా నిలిచి సీఎస్కే భారీ స్కోరు చేయడంలో అతడికి తోడ్పాటు అందించారు. మూడు బౌండరీలు, ఓ సిక్స్‌తో జోరు మీద కనిపించిన కెప్టెన్ రుతురాజ్ (22)ను ఘజన్ఫర్ మూడో ఓవర్లోనే వెనక్కి పంపినా పవర్ ప్లేలో సంజూ జోరుకు ముంబై అడ్డుకట్ట వేయలేకపోయింది. హార్ధిక్ 4వ ఓవర్లో 4, 6, 4, 4 రాబట్టిన అతడు.. బుమ్రా ఓవర్లోనూ కళ్లుచెదిరే సిక్స్‌తో అలరించాడు. మూడు బౌండరీలతో ఊపు మీద ఉన్న సర్ఫరాజ్ (14)ను పవర్ ప్లే ఆఖరి ఓవర్లో శాంట్నర్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. దూబే (5) సైతం నిరాశపరిచినా చెన్నై భారీ ఆశలు పెట్టుకున్న బ్రెవిస్ (11 బంతుల్లో 21, 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. అశ్వని 11వ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ పూర్తిచేసిన సంజూ.. కార్తీక్ (18) అండతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. కార్తీక్‌ను బుమ్రా, ఒవర్టన్ (15)ను అశ్వని ఔట్ చేయడంతో సీఎస్కే 200 మార్కును అందుకుంటుందా? అని అనిపించింది. కానీ క్రిష్ చివరి ఓవర్లో తొలి బంతికే సిక్స్ బాది 90లలోకి వచ్చిన చేట.. నాలుగో బంతికి మరో సిక్స్, లాస్ట్ బాల్‌కు ఫోర్ కొట్టి ఈ సీజన్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు.

చెన్నై: 20 ఓవర్లకు 207/6 (శాంసన్ 101*, గైక్వాడ్ 22, ఘజన్ఫర్ 2/25, అశ్వని 2/37);
ముంబై: 19 ఓవర్లకు 104 ఆలౌట్ (తిలక్ 37, సూర్య 35, అకీల్ 4/17, నూర్ 2/23)