క్రికెట్లో 36 ఏండ్ల వయసు సాధారణంగా ఆటగాళ్లకు రిటైర్మెంట్ ప్రకటించే సమయం. అత్యంత వేగంగా సాగే, జెన్‌జీ ఆధిపత్యం ఉన్న టీ20 క్రికెట్లో.. నాలుగేండ్ల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఒక పేసర్ మళ్లీ లేటు వయసులో టీమిండియా జెర్సీ వేసుకోవడం దాదాపు అసాధ్యం. కానీ, ఆ అసాధ్యాన్ని తన బౌలింగ్ నైపుణ్యంతో సుసాధ్యం చేసి చూపించాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్. న్యూజిలాండ్‌తో జరిగే 5 టీ20ల సిరీస్‌తో సుదీర్ఘ విరామం తర్వాత ఈ వెటరన్ పేసర్ అంతర్జాతీయ ఆటలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. 2022లో అప్పటి చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఏ కారణాలు చెప్పి తనను తప్పించిందో ఇప్పుడు అదే స్వింగ్ నైపుణ్యం అతడిని మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకొచ్చింది.
ప్రసిద్ధ ఎస్జీ క్రికెట్ బంతులు తయారయ్యే ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ నుంచి వచ్చిన భువనేశ్వర్ గాలిలో బంతిని డ్యాన్సింగ్ బాల్లా తిప్పడంలో సిద్ధహస్తుడు. ఆ ప్రదేశానికే చెందిన భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ గతంలో చెప్పినట్లు మీరట్ గాలిలోనే ‘స్వింగ్’ మాయాజాలం ఉందేమో అనిపించేలా భువీ బౌలింగ్ సాగుతుంది. పర్ఫెక్ట్ ఔట్ స్వింగర్లు, అనూహ్యంగా లోపలికి వచ్చే ఇన్ కట్టర్లతో బ్యాటర్లను అల్లాడించడం తన ప్రత్యేకత. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ దాడికి స్వింగ్ రాక ఇబ్బంది పడిన భువీ.. ఆ తర్వాత నేపియర్‌లో న్యూజిలాండ్‌తో చివరి టీ20లో వేగం తగ్గి బోసిపోయినప్పుడు అతని కెరీర్ ముగిసిందని విమర్శకులు తీర్పు ఇచ్చేశారు. కానీ, క్లాసికల్ స్వింగ్ కళకు ఎప్పటికీ కాలం చెల్లదని, అనుభవంతో వచ్చే బంతి కదలిక ముందర ఏ బ్యాటర్ అయినా తలవంచాల్సిందేనని భువనేశ్వర్ నిరూపించాడు.
భారత జట్టుకు దూరమైన తర్వాత భువీ అధైర్యపడలేదు. ఎవ్వరినీ నిందించలేదు. ఇందుకు కారణం ఏంటో తెలుసుకొని దాన్ని సరిచేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. ముందుగా తన ఫిట్నెస్ను మెరుగు పరుచుకున్నాడు. నిశ్శబ్దంగా రోజుకు 5 నుంచి 7 గంటలు మైదానంలో, జిమ్‌లో చెమటోడ్చాడు. మూడేండ్ల క్రితం అతను తీవ్రమైన వీపు నొప్పితో బాధపడ్డాడు. దానికితోడు శరీరంలో కొవ్వు శాతం 20 శాతానికి పెరిగింది. దాంతో తన ఫిట్నెస్ ట్రైనర్ సూర్య యాదవ్‌తో కలిసి కఠోరంగా శ్రమించడం మొదలుపెట్టాడు. జిమ్ లో చెమటలు చిందిస్తూ శరీరంలో కొవ్వును 13-14 శాతానికి తగ్గించుకున్నాడు. ఒకప్పుడు 40 కేజీల బరువుతో మాత్రమే స్క్వాట్స్ చేసే భువీ ఇప్పుడు ఏకంగా 110-120 కేజీల బరువులను సునాయాసంగా ఎత్తుతున్నాడు. ఫిట్నెస్ మెరుగైన తర్వాత తిరిగి నెమ్మదిగా తన బౌలింగ్ వేగాన్ని పెంచుకున్నాడు. గత ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ వికెట్ ఎగరగొట్టినప్పుడు, సాయి సుదర్శన్‌ను బౌన్సర్‌తో వెనక్కిపంపినప్పుడు భువీ వేగం దాదాపు 140 కి.మీ. తాకింది. యూపీ టీ20 లీగ్‌లో వైరల్ ఫీవర్ వచ్చి గ్రౌండ్‌లోనే ఐవీ స్లైన్ ఎక్కించుకున్నా.. మరుసటి రోజే మైదానంలో వాలిపోవడం ఆటపై అతడి నిబద్ధతకు అద్దం పడుతోంది.
ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడిన గత రెండు సీజన్లు భువనేశ్వర్ తలరాతను మార్చివేశాయి. కొత్త బంతితో ప్రత్యర్థి జట్ల టాపార్డర్ నడ్డి విరుస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రెండు సీజన్లలో కలిపి 45 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇందులో 25 వికెట్లు కేవలం పవర్‌ప్లేలోనే తీయడం అతని సత్తాకు నిదర్శనం. ఇక, మాజీ చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఉన్నంతకాలం కేవలం యువ ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలనే నిబంధనను పాటించాడు. సెలెక్టర్ ఆర్పీ సింగ్.. భువనేశ్వర్ పేరును ప్రతిపాదించినా అగార్కర్ అంగీకరించలేదు. కానీ అగార్కర్ తప్పుకుని, ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక బాధ్యతలు చేపట్టడంతో భువీ రీఎంట్రీ సులువైంది. బుమ్రా లేని సమయంలో మయాంక్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ పేసర్లకు భువీ మార్గదర్శకత్వం 2028 టీ20 ప్రపంచకప్‌కు దోహదపడుతుందని భావించిన సెలెక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేశారు.
భువీ పునరాగమనం చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి మరో వెటరన్ పేసర్ మహ్మద్ షమీపై పడింది. భువనేశ్వర్ బాటలోనే 36 ఏండ్ల షమీ కూడా తిరిగి జట్టులోకి రాగలడా? అనే ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో అదరగొట్టిన భువీ టీ20 జట్టులో రీఎంట్రీ సాధిస్తే.. మరోవైపు షమీ ఎక్కువగా రెడ్ బాల్‌పై ఫోకస్ పెట్టి దేశవాళీ టోర్నీల్లో నిప్పులు చెరుగుతున్నాడు. ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా గాయం నుంచి కోలుకున్న తర్వాత 2025-26 సీజన్ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున 7 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 37 వికెట్లు తీసి జట్టును సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. విజయ్ హజారే ట్రోఫీలో 15 వికెట్లు, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ 14 ఏండ్ల తర్వాత విజేతగా నిలవడంలో 7 వికెట్లతో షమీ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం టెస్టుల్లో బుమ్రా లేని సమయంలో పేస్ బాధ్యతలు మోసే భారం మొత్తం హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌పైనే పడుతుంది. భువీ మాదిరిగా షమీ కూడా రీఎంట్రీ ఇస్తే టెస్టు ఫార్మాట్లో భారత బౌలింగ్ మరింత పదునెక్కడం ఖాయం.