Belinda Clark : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్(Belinda Clark)కు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశంలో మహిళా క్రికెట్ అభివృద్ధికి, ప్రచారానికి విశేషమైన కృషి చేసిన క్లార్క్‌కు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. ఆమెకు లెజెండ్ హోదాను ప్రదానం చేసిన ఆసీస్ బోర్డు.. సిడ్నీ క్రికెట్ మైదానంలో క్లార్క్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘనత సాధించిన ఆరో ఆసీస్ క్రికెటర్ బెలిండా. ఆమె కంటే ముందు డొనాల్డ్ బ్రాడ్‌మన్, కీత్ మిల్లర్, రిచీ బెనౌడ్, డెన్నిస్ లిల్లీ, షేన్ వార్నర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించారు. అయితే.. తొలి మహిళా క్రికెటర్ మాత్రం బెలిండానే కావడం విశేషం.
‘ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం చాలా గొప్ప గౌరవం. నాకు లెజెండ్ స్టేటస్ రావడాన్ని నమ్మలేకపోతున్నా. దేశానికి సేవ చేసిన దిగ్గజ ఆటగాళ్ల సరసన నా పేరు ఉండడంతో సంతోషం ఉంది. ఒకింత గర్వంగా అనిపిస్తోంది. మరోవైపు కృతజ్ఞతాభావం కూడా మనసులో నిండింది. నేను సమిష్టితత్వం కలగలసిన ఆటతో పేరు సాధించాను. జట్టులోని సభ్యుల సహకారం, పోరాటపటిమ లేకుండా మనం ఏదీ సాధించలేం. నాకు ఈ ఘనత దక్కడంలో తమ పాత్ర ఉందని కోచ్‌లు, సహాయక సిబ్బంది, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు సంతోషిస్తారు’ అని బెలిండా క్లార్క్ తెలిపింది.
Belinda Clark is just the sixth cricketer to be given the honour after Donald Bradman, Keith Miller, Richie Benaud, Dennis Lillee and Shane Warne ▶️ https://t.co/FZDUlOUh46 pic.twitter.com/XZHpSLfE2w
— ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2025
సారథిగా ఆసీస్ మహిళా టీమ్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లింది బెలిండా. ఆమె నేతృత్వంలో 101 వన్డేల్లో ఏకంగా 83 మ్యాచుల్లో గెలిచింది కంగారూ టీమ్. బ్యాటర్‌గా గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమె వన్డేల్లో 47.49 సగటు, టెస్టుల్లో 45.95 సగటుతో అత్యధిక సగటుతో రాణించింది. అంతేకాదు డబుల్ సెంచరీ బాదిన తొలి మహిళా క్రికెటర్ కూడా ఆమెనే. 1997 వరల్డ్ కప్‌లో బెర్ముడాపై 229 పరుగులతో అజేయంగా నిలిచింది బెలిండా.
బెలిండా క్లార్క్
‘బెలిండా మా దేశంలో మహిళా క్రికెట్‌కు ఆమె చుక్కాని. తను అద్భుతమైన బ్యాటర్. అప్పటి వరకూ సంప్రదాయ క్రికెట్ ఆడుతున్న మా జట్టుకు దూకుడు నేర్పింది. బౌలర్లపై విరుచుకుపడడం ఎలానో చూపించింది బెలిండా. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా తన ముద్ర వేసింది. ఆమె నాయకత్వ పటిమ.. యువతరంపై ఆమె చూపిన ప్రభావం చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని బెలిండాను హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపిక చేసిన కమిటీ అధ్యక్షులు బ్రుసే మెక్అవనే వెల్లడించారు.