ముంబై: ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ పదవిపై కొంతకాలంగా చర్చ జరుగుతున్న సమయంలో ఆదివారం ఈ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. హెడ్ కోచ్‌తోపాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు, నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పోర్ట్స్ సైన్స్/మెడిసిన్ హెడ్ పదవులకు కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 26 సాయంత్రం 5 గంటలలోపు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులు సమర్పించాలని కోరింది. ఇతర పదవుల కోసం నవంబర్ 3వ తేదీ వరకూ సమయం ఇచ్చింది.
ఇప్పటికే హెడ్ కోచ్ పదవికి మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ దాదాపు ఖాయమయ్యాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత ఆరేళ్లుగా ద్రవిడ్ ఇండియా ఎ, అండర్-19 టీమ్స్‌కు ఇన్చార్జ్గా ఉండటంతోపాటు ప్రస్తుతం నేషన్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా కూడా ఉన్నాడు. ఆదివారం ప్రారంభమైన టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ రవిశాస్త్ర ఆ పదవి నుంచి దిగిపోనున్న విషయం తెలిసిందే.