Pakistan Cricket Team | పాకిస్తాన్ క్రికెటర్ల శరీరంలో ఉండాల్సినదానికంటే కొవ్వు ఎక్కువ ఉందని ఆ జట్టు మాజీ సారథి, ఇటీవలే ఆ జట్టుకు టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన మహ్మద్ హఫీజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ మాజీ సారథి బాబర్ ఆజమ్, హెడ్‌కోచ్ మికీ ఆర్థర్లు ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదని, పాక్ క్రికెటర్లలో ఒక్కొక్కరికి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉండాల్సినదానికంటే అధిక మోతాదులో ఉందని ఆరోపించాడు. తాను టీమ్ డైరెక్టర్ అయ్యేంతవరకూ ఈ విషయం తెలియదని, టీమ్‌లో ఉన్న క్రికెటర్లు కనీసం రెండు కిలోమీటర్ల దూరం కూడా పరుగెత్తలేని స్థితిలో ఉన్నారని హఫీజ్ అన్నాడు.
బాబర్, ఆర్థర్ వద్దన్నారు..
ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్ మాట్లాడుతూ… ‘‘నేను పాక్ టీమ్‌కు డైరెక్టర్‌గా వచ్చిన వెంటనే జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిరీస్ ప్రారంభానికి ముందు నేను టీమ్ ట్రైనర్‌తో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించిన రిపోర్టు కావాలని అడిగాను. కానీ అప్పుడు అతడు నాతో చెప్పిన మాటలు విని షాక్ అయ్యాను. ‘జట్టులో ఆడేందుకు ఫిట్నెస్ అంత ప్రియారిటీ ఏం కాదు. ఆటగాళ్లను వాళ్లకు నచ్చినట్టుగా ఉండనివ్వండి అని ఆరు నెలల క్రితం మాజీ సారథి (బాబర్), మాజీ హెడ్‌కోచ్ (మికీ ఆర్థర్)లు నాతో చెప్పారు..’ అని టీమ్ ట్రైనర్ నాతో అన్నాడు. అప్పట్నుంచి అతడు ఆటగాళ్ల ఫిట్నెస్ను పట్టించుకోవడం లేదని అన్నాడు’’ అని హఫీజ్ తెలిపాడు.
కొవ్వెక్కువ..
ఫిట్నెస్తో పాటు పాక్ క్రికెటర్ల బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చితే దారుణంగా ఉన్నాయని హఫీజ్ అన్నాడు. ‘ప్లేయర్ల బాడీ ఫ్యాట్ లెవల్ ఉండాల్సినదానికంటే ఒకటిన్నర పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. అదీగాక వాళ్లు కనీసం రెండు కిలోమీటర్లు కూడా పరుగెత్తలేకపోతున్నారు..’ అని ఆరోపించాడు. బాబర్ హయాంలో పాక్ క్రికెటర్ల ఫిట్‌నెస్‌పై గతంలో కూడా విమర్శలు వచ్చినా హఫీజ్ స్థాయిలో మాత్రం ఎవరూ చేయలేదు.
వన్డే వరల్డ్ కప్‌లో పాక్ జట్టు సెమీస్ చేరడంలో విఫలమవడంతో పీసీబీ.. బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆర్థర్‌పై వేటు వేసింది. అదే సమయంలో హఫీజ్‌ను టీమ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్లలో హఫీజే ఆ జట్టుకు హెడ్‌కోచ్‌గా కూడా వ్యవహరించాడు. కానీ ఈ రెండు సిరీస్‌లలో పాకిస్తాన్ అట్టర్ ప్లాఫ్ అయింది. దీంతో పీసీబీ.. హఫీజ్‌ను టీమ్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది.