మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు భీకర స్థాయిలో నమోదు అవుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే ఆ దేశంలో అడుగుపెట్టనిస్తున్నారు. అక్కడ మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా.. వ్యాక్సిన్ తప్పనిసరి. ఇలాంటి నిబంధనల నడుమ.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వస్తున్న ఆటగాళ్లకు .. టీకా మినహాయింపు కల్పిస్తున్నారు. వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్, గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను 9 సార్లు గెలిచిన నోవాక్ జోకోవిచ్‌కు టీకా నుంచి మినహాయింపు ఇవ్వడం పట్ల ఆ దేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సిన్ రూల్స్‌ను సడలించిన తీరు పట్ల ఆస్ట్రేలియన్లు ఆగ్రహంగా ఉన్నారు. డిఫెండింగ్ చాంపియన్‌కు ప్రత్యేక వసతులు కల్పించలేదంటున్న నిర్వాహకులు.. మరి వ్యాక్సిన్ వేసుకోని జోకోవిచ్‌కు టెన్నిస్ టోర్నీ ఆడేందుకు ఎలా పర్మిషన్ ఇచ్చారని నిలదీస్తున్నారు.
26 మంది అథ్లెట్లు వ్యాక్సిన్ మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు చీఫ్ క్రెయిగ్ టిలే తెలిపారు. కానీ కొందరికే అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. మినహాయింపు కోసం పకడ్బందీ దరఖాస్తును రూపొందించామన్నారు. గత ఏడాది వ్యాక్సిన్ తీసుకోను అని జోకోవిచ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకోని క్రీడాకారుడికి ఎలా అనుమతి ఇచ్చారని ఆస్ట్రేలియన్ల ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్ స్టేటస్ చెప్పని జోకోవిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో జోకోవిచ్ వైఖరిని ఖండిస్తూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఏ అంశాల ఆధారంగా మినహాయింపు పొందిన విషయాన్ని జోకోవిచ్ పబ్లిక్‌గా చెబితేనే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.