ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో స్వియాటెక్‌పై అన్‌సీడెడ్ నొకోవా విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాజ్, జ్వెరెవ్, మెద్వెదెవ్, నోరీ ముందంజ వేయగా.. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు బాలాజీ ద్వయం పరాజయం పాలైంది.
మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో టాప్ సీడ్ స్వియాటెక్ 6-3, 3-6, 4-6తో ప్రపంచ 50వ ర్యాంకర్ లిండా నొకోవా చేతిలో ఓడింది. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న స్వియాటెక్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోతున్నది. మెల్బోర్న్లో స్వియాటెక్ ఒక్కసారి కూడా సెమీఫైనల్ దాటలేదు. తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన 19 ఏండ్ల నొకోవా.. మొదటి సెట్ కోల్పోయిన తర్వాత అద్భుతంగా పుంజుకొని వరుస సెట్లలో నంబర్‌వన్ ఆట కట్టించింది. రెండున్నర గంటల పాటు సాగిన పోరులో స్వియాటెక్ 4 ఏస్‌లు కొట్టి ఒక డబుల్‌ఫాల్ట్ చేస్తే.. నొకొవా 10 ఏస్‌లు బాదింది. స్వియాటెక్ 34 విన్నర్లు సంధిస్తే.. నొకొవా 35 విన్నర్లు కొట్టి.. 37 అనవసర తప్పిదాలు చేసింది. నొకొవా చాకచక్యంగా నెట్ పాయింట్స్ సాధిస్తూనే.. బ్యాక్ హ్యాండ్ పవర్ గేమ్‌తో వరుసగా 18 మ్యాచ్‌లు నెగ్గిన స్వియాటెక్‌ను మట్టికరిపించింది. ఇతర మ్యాచ్‌ల్లో స్వితోలినా 6-2, 6-3తో గాల్బిక్పై.. అజరెంక 6-1, 7-5తో ఒస్టపెంకాపై విజయాలు సాధించారు.
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లొస్ అల్కరాజ్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం మూడో రౌండ్లో షాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 6-1, 6-1, 1-0తో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయం కారణంగా వాకొవర్ ఇవ్వడంతో ముందంజ వేశాడు. అంతకుముందు జరిగిన రెండు సెట్లలోనూ 18 ఏండ్ల అల్కరాజ్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ జ్వెరెవ్ 6-2, 7-6 (7/4), 6-2తో మష్లెసన్పై.. మూడోసీడ్ మెద్వెదెవ్ 6-3, 6-4, 6-3తో ఆగర్‌పై.. నోరీ 6-4, 6-7 (7/9), 6-4, 6-3తో రూడ్‌పై.. బొర్గస్ 6-7 (3/7), 6-4, 6-2, 7-6 (8/6)తో దిమిత్రోవ్‌పై విజయాలు సాధించారు. ఆదివారం జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో మన్నారినోతో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తలపడనున్నాడు.
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు బాలాజీ పరాజయం పాలయ్యాడు. శనివారం రెండో రౌండ్లో బాలాజీ-విక్టర్ (రొమేనియా) జోడీ 3-6, 3-6 తేడాతో మార్సెలో-పావిక్ ద్వయం చేతిలో ఓడింది. చాన్నాళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ రెండో రౌండ్‌కు చేరిన బాలాజీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక వెనుకబడి పోయాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టిన రోహన్ బోపన్న.. మిక్స్డ్ డబుల్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.