మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ టెస్టు ప్లేయర్ విల్ పుకోవిస్కీ(Will Pucovski).. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే కంకషన్ వల్ల అతను రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. క్రికెట్ నిపుణులు ఇచ్చిన సలహా మేరకు అతను డిసిషన్ తీసుకున్నాడు. పలుమార్లు పుకోవిస్కీ తలకు బంతి తగిలింది. దీంతో అతను ప్రతిసారి కంకషన్‌కు లోనయ్యాడు. వాస్తవానికి విల్ పుకోవిస్కీ.. ఇండియాపై టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. 2021లో అతను ఇండియా సిరీస్‌లో ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. మళ్లీ మళ్లీ కంకషన్ పరిస్థితులు తలెత్తడం వల్లే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆ 27 ఏళ్ల బ్యాటర్ చెప్పాడు.
తాజాగా గత ఏడాది మార్చిలో షీఫీల్డ్ షీల్డ్ టోర్నీలోనూ అతని హెల్మెట్‌కు బంతి తగిలింది. అప్పటి నుంచి అతను క్రికెట్‌కు దూరం అయ్యాడు. సమ్మర్ సీజన్లో అతను ఆడలేకపోయాడు. ఆ తర్వాత లీసెష్టర్షైర్తో ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కంకషన్ నుంచి కోలుకోవాలనుకున్నా, కానీ ఆ పరిస్థితులు మెరుగవ్వడం లేదని, అందుకే ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడవద్దు అని డిసైడ్ అయినట్లు చెప్పాడు. క్రికెట్ నుంచి రిటైర్ కావాలని గతేడాది ఓ మెడికల్ ప్యానల్ పుకోవిస్కీకి సూచన చేసింది.
పుకోవిస్కీ 36 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో అతను ఏడు సెంచరీలు, 9 ఫిఫ్టీలు చేశాడు. ఇండియాతో ఆడిన సిడ్నీ టెస్టులో అతను 62, 10 రన్స్ చేశాడు. మెల్బోర్న్ ప్రీమియర్ క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా చేయనున్నట్లు పుకోవిస్కీ తెలిపారు.