Bob Simpson : ఆస్ట్రేలియా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ (Bob Simpson) కన్నుమూశాడు. టెస్టుల్లో ఆసీస్ ఆధిపత్యంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆల్‌రౌండర్.. అనారోగ్యంతో 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు. శనివారం సిడ్నీలోని తన నివాసంలో సింప్సన్ మరణించాడని ఆస్ట్రేలియా క్రికెట్ వెల్లడించింది. ఒక లెజెండరీ ఆటగాడిని కోల్పోయామని ట్వీట్ చేసింది ఆసీస్ బోర్డు.
‘టెస్టు జట్టు సారథి, కెప్టెన్, కోచ్, జాతీయ సెలెక్టర్.. ఇలా ఎన్నో పాత్రల్ని పోషించిన బాబ్ సింప్సన్ ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక శిఖరం లాంటివాడు. మా దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశాడు. ఒక దిగ్గజ ఆటగాడిని కోల్పోయాం. ఈ బాధాకరమైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు సానూభూతి తెలియజేస్తున్నాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా పోస్ట్‌లో వెల్లడించింది.
RIP to a true cricket legend.
A Test cricketer, captain, coach and national selector – Bob Simpson was a mighty figure in Australian cricket, giving everything to our game.
Cricket Australia extends our thoughts and sympathies to Bob’s family and friends. pic.twitter.com/U8yGeZNmCb
— Cricket Australia (@CricketAus) August 16, 2025
విధ్వంసక ఆటగాడిగా పేరొందిన బాబ్ సింప్సన్ పదహారేళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. న్యూ సౌత్ వేల్స్ జట్టు తరుఫున ఆడిన అతడు లెగ్ స్పిన్నర్ కూడా. దేశవాళీలో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన సింప్సన్ 1957లో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్లో శుభారంభాలు ఇస్తూ అనతికాలంలోనే విలువైన ఓపెనర్‌గా పేరు గడించాడు. 29 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు సారథ్యం వహించిన సింప్సన్ 1968లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. జట్టుకోసం 1977లో మళ్లీ జెర్సీ వేసుకున్నాడు. అప్పుడు అతడి వయసు 41 ఏళ్లు. మొత్తంగా 62 టెస్టుల్లో 46.81 సగటుతో రాణించాడు. స్లిప్‌లో చురుకైన ఫీల్డర్‌గా ప్రశంసలు అందుకున్న ఈ వెటరన్.. లెగ్ స్పిన్‌తో బ్యాటర్లను బురిడీ కొట్టిస్తూ 71 వికెట్లు తీశాడు.
Our condolences to the friends and family of Bob Simpson.
The ICC Hall of Famer and former Australia captain has passed away, aged 89. pic.twitter.com/ybQE3k28qn
— ICC (@ICC) August 16, 2025
వీడ్కోలు తర్వాత 1986లో కోచ్‌గా పగ్గాలు చేపట్టాడు సింప్సన్. మరుసటి ఏడాదే జాతీయ సెలెక్టర్‌గా జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించాడు. క్రమశిక్షణ, కష్టపడేతత్వం కలిగిన ఆటగాళ్లనే తీసుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు సింప్సన్. అతడు సెలెక్టర్‌గా ఉన్నప్పుడే డేవిడ్ బూన్, డీన్ జోన్స్ స్టీవ్ వా, మెర్వ్ హ్యూస్ స్టార్లు ఆసీస్ క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.