ODI World Cup 2023 | వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి ఓవర్ వేసిన మిషెల్ స్టార్క్ ప్రత్యర్థిని మన్కడింగ్ చేసే అవకాశం ఉన్నా.. హెచ్చరించి వదిలేశాడు. ఇలా మ్యాచ్లో ఒకటికి రెండు సార్లు అవకాశం దక్కించుకున్న కుషాల్ పెరెరా ధాటిగా ఆడి అర్ధశతకం సాధించడంతోనే లంక ఆ మాత్రం స్కోరైన చేయగలిగింది.
తొలి ఓవర్ ప్రారంభించిన స్టార్క్.. మూడో బంతి వేసే సమయానికి నాన్స్ట్రయికర్ ఎండ్లో ఉన్న పెరెరా కాస్త ముందుకు కదిలాడు. స్టార్క్ చేతి నుంచి బంతి రిలీజ్ కాకముందే.. పెరెరా గీత దాటి ముందుకు రాగా.. బౌలింగ్ చేయడం ఆపేసిన స్టార్క్ ఈ విషయాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. కుషాల్ హెచ్చరించాడు. ఇక ఇదే ఘటన ఐదో ఓవర్లోనూ రిపీట్ అయింది. స్టార్క్ బౌలింగ్లో మరోసారి కుషాల్ క్రీజు దాటి ముందుకు రాగా.. ఇది మంచి పద్దతి కాదని స్టార్క్ హెచ్చరించాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కాస్త ప్రయత్నించి ఉంటే.. స్టార్క్ ఖాతాలో వికెట్ పడేదే.. కానీ అతడు మాత్రం అలా చేయలేదు.
సాధారణంగా క్రీడా స్ఫూర్తికి తిలోదకాలు వదులుతారనే ముద్ర పడ్డ కంగారూలు ఇటీవలి కాంలో అందుకు భిన్నంగా ప్రయత్నిస్తున్నారనేది కాదనలేని వాస్తవం. గతంలో ఏ జట్టుతో ఆడినా.. మ్యాచ్కు ముందే తమ మాటల తూటాలు, శరీర భాషతో ప్రత్యర్థిని భయపెట్టే ఆసీస్ ఇటీవలి కాలంలో ఆ పని చేయడం లేదు. వన్డే ప్రపంచకప్లో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఈ సారి మాత్ర బోణీ కొట్టేందుకు మాత్రం సుదీర్ఘంగా నిరీక్షిస్తోంది.