ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా భావిస్తున్న అర్జెంటీనాకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ర్యాంకింగ్ పరంగా దాదాపు ఓ 50 స్థానాలు వెనుక ఉన్న సౌదీ అరేబియా..అర్జెంటీనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ మెస్సీసేనను మట్టికరిపించింది. అర్జెంటీనా వరుస విజయాల(36)కు చెక్‌పెట్టిన సౌదీ అద్భుత విజయంతో బోణీ కొట్టింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో సౌదీ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. తమ జాతీయ జట్టు అర్జెంటీనాపై గెలిచిన సందర్భంగా సౌదీ రాజు బుధవారం సెలవుదినంగా ప్రకటించారు.
లుసేల్: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో సంచలనాల పర్వం మొదలైంది. పోరాడితే పోయేది ఏమి లేదన్న తరహాలో పసికూనలు అనుకున్న జట్లు చాంపియన్లకు దీటైన సవాలు విసురుతున్నాయి. టైటిల్ గెలుస్తారని భావిస్తున్న జట్లలో ఒకటైన అర్జెంటీనా, సౌదీ అరేబియాపై అలవోక విజయం ఖాయమని అనుకున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. ఊహించినట్లు జరిగితే అది ఫుట్‌బాల్ ఎందుకు అవుతుంది. కనీసం పోటీనైనా ఇస్తుందా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ సౌదీ అరేబియా 2-1తో అర్జెంటీనాపై అద్భుత విజయం సాధించింది.
సౌదీ తరఫున సాలేహ్ అల్షెహరీ(48ని), సలేమ్ అల్దావస్రీ(53ని) గోల్స్ చేయగా, కెప్టెన్ లియోనల్ మెస్సీ(10ని) అర్జెంటీనాకు ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ మొత్తంగా చూస్తే బంతిని 64శాతం అర్జెంటీనా తమ ఆధీనంలో ఉంచుకోగా, సౌదీ అరేబియా 24శాతానికి పరిమితమైంది. అయితే గోల్‌పోస్ట్‌పై ఆరుసార్లు ప్రయత్నించిన అర్జెంటీనా విఫలం కాగా, రెండుకు రెండు ప్రయత్నాల్లో సౌదీ సఫలమైంది. పటిష్ఠ అర్జెంటీనా డిఫెన్స్‌ను కంగుతినిపిస్తూ సౌదీ స్ట్రైకర్లు చేసిన దాడులు గురితప్పలేదు. మరోవైపు సౌదీ గోల్‌కీపర్ మహమ్మద్ అల్వైస్ పెట్టని గోడలా అర్జెంటీనా దాడులను కాచుకున్నాడు.
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాపై విజయం సాధించిన నేపథ్యంలో సౌదీ రాజు సాల్మన్ బుధవారం దేశ మంతటా సెలవుదినంగా ప్రకటించారు. జాతీయ జట్టు చిరస్మరణీయ విజయాన్ని ఆస్వాదించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు తోడు విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
యూఎస్ఏ 1-0తో ఇంగ్లండ్‌పై (1950)
అల్జీరియా 2-1తో వెస్ట్ జర్మనీపై (1982)
కామెరూన్ 1-0తో అర్జెంటీనాపై (1990)
సెనెగల్ 1-0తో ఫ్రాన్స్‌పై (2002)
ఘనా 2-0తో చెక్ రిపబ్లిక్‌పై (2006)
స్విట్జర్లాండ్ 1-0తో స్పెయిన్‌పై (2010)