Paris Olympics : భారత ఆర్చర్ అంకిత భకత్(Ankita Bhakat) అంచనాలు నెలబెట్టుకుంది. చెక్కుచెదరని గురితో ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) బెర్తు సాధించింది. వరల్డ్ ఆర్చరీ క్వాలిఫయర్‌లో మెరిసిన 25 ఏండ్ల అంకిత మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. టర్కీలో ఆదివారం జరిగిన పోటీల్లో భారత స్టార్ గురిచూసి బాణం విసిరింది.
ఫిలీఫ్పీన్స్కు చెందిన గాబ్రియెల్లె మొనికా (Gabrielle Monica)ను వరుస సెట్లలో ఓడించింది. 6-0(26-23, 28-22, 28-23)తో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి అంకిత టాప్ సీడ్ మొబినా ఫల్లాహ్(ఇరాన్)తో పోటీ పడనుంది.
విశ్వ క్రీడలకు అంకిత ఎంపికవ్వడంతో భారత్ ఆర్చరీలో పురుషుల, మహిళల కేటగిరీలో పోటీ పడనుంది. మెన్ కేటగిరీలో ధీరజ్ బొమ్మదేవర (Dhiraj Bommadevara) ఇప్పటికే ప్యారిస్ బెర్తు దక్కించుకున్నాడు. అసియాన్ క్వాలిఫైయింగ్‌లో ధీరజ్ ఒలింపిక్స్ టోర్నీకి అర్హత సాధించాడు.