జాగ్రెబ్(క్రొయేషియా) : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతున్నది. సెమీఫైనల్‌కు చేరి ఆకట్టుకున్న యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ ముందంజ వేయలేకపోయింది. బుధవారం జరిగిన మహిళల 53కిలోల సెమీస్ బౌట్లో అంతిమ్ 3-5 తేడాతో లుసియా యెపెజ్ గుజ్మన్(ఈక్వెడార్) చేతిలో ఓడింది. సెమీస్ వరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన అంతిమ్..అదే దూకుడు కనబర్చలేకపోయింది. పారిస్ ఒలింపిక్స్ రజత విజేత అయిన లుసియా తన ఎత్తును అనుకూలంగా మలుచుకుంటూ అంతిమ్‌పై ఆధిపత్యం చెలాయించింది.
ఏ దశలోనూ పట్టు వదలని లుసియా తొలి అర్ధభాగంలోనే 4-1 ఆధిక్యం ప్రదర్శించింది. కీలకమైన ద్వితీయార్ధంలోనూ ఈ ఈక్వెడార్ యువ రెజ్లర్ పోరుపై పూర్తి పట్టు సాధించింది. అంతిమ్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పైచేయి సాధించలేకపోయింది. దీంతో మ్యాచ్ చేజార్చుకున్న అంతిమ్..కాంస్య పతక పోరుకు సిద్ధమైంది. మరోవైపు మనీశా భన్వాల(62కి) రెప్‌చేజ్‌లో బరిలోకి దిగనుండగా, రాధిక(68కి), జ్యోతి బేరివాల్(72కి) ప్రత్యర్థుల చేతిలో ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.