INDvsAFG T20I: భారత్ – అఫ్గాన్ మధ్య మరో రెండు రోజుల నుంచి మొదలుకాబోతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం మొహాలీ (పంజాబ్) వేదికగా జరగనుంది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్ ఆడబోయే ఆఖరి మూడు మ్యాచ్‌లు ఇవే కావడంతో ఈ సిరీస్‌పై మెన్ ఇన్ బ్లూ ప్రత్యేక దృష్టి సారించింది. రోహిత్, కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు ఈ సిరీస్‌తో టీ20లలోకి రీఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌పై అభిమానుల్లో కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఆడేది అఫ్గాన్‌తో అయినా ఆ జట్టు ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్లను ఓడించడమే గాక ఆసీస్‌ను కూడా ఓడించినంత పనిచేయడంతో ఆ జట్టుతో అంత వీజీ కాదన్న అభిప్రాయమూ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్ జరగాల్సిన మొహాలీ స్టేడియం ఎలా స్పందించబోతోంది..? భారత్‌కు ఇక్కడ రికార్డులు ఎలా ఉన్నాయి..?
మొహాలీ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 180 ప్లస్ స్కోరు చేసినా గెలవడం కష్టమే. ఛేదనలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఐపీఎల్లో ఇది చాలా సార్లు ప్రూవ్ అయింది. టీ20లలో భారత్ చివరిసారిగా ఇక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల భారీ స్కోరును భారత్ ఛేదించింది. హార్ధిక్ పాండ్యా.. 30 బంతుల్లోనే 70 పరుగులు చేసి భారత్‌కు ఘనవిజయాన్ని అందించాడు. మొహాలీలో భారత్ ఇప్పటివరకూ నాలుగు టీ20లు ఆడి మూడింట్లో విజయాలు సాధించి ఒకదాంట్లో ఓడింది. ఇక్కడ టాస్ గెలిచిన సారథి మరో ఆలోచన లేకుండా మొదట బౌలింగ్ ఎంచుకుంటాడు. రాత్రి పూట మంచు కూడా ఇక్కడ బౌలర్లకు పరీక్ష పెడుతుంది.
What do you all make of this power-packed T20I squad set to face Afghanistan? 😎#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/pY2cUPdpHy
— BCCI (@BCCI) January 7, 2024
మొహాలీ స్టేడియంలో 1993 నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న భారత్.. ఇప్పటివరకూ మొత్తంగా 35 మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌లలో గెలిచి 8 మ్యాచ్‌లలో ఓడింది. ఐదు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. డ్రా అయిన మ్యాచ్‌లన్నీ టెస్టులే. ఇక్కడ 14 టెస్టులు ఆడిన భారత్.. 8 గెలిచి ఐదు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఒక్క టెస్టు మాత్రమే ఓడిపోయింది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ – పాకిస్తాన్ మధ్య సెమీస్ ఇక్కడే జరిగిన విషయం విదితమే.