World Archery Championships | బెర్లిన్: ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో సంచలనం నమోదైంది. మన దేశానికి చెందిన 17 ఏండ్ల యువ ఆర్చర్ అదితి స్వామి వ్యక్తిగత స్వర్ణం నెగ్గి నయా చరిత్ర లిఖించింది. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు భారత్ తరఫున ఏ ఒక్కరూ వ్యక్తిగత స్వర్ణం దక్కించుకోలేకపోగా.. అదితి ఆ రికార్డును బద్దలు కొడుతూ.. మహిళల కాంపౌండ్ విభాగంలో పసిడి కాంతులు విరజిమ్మింది. శనివారం తుదిపోరులో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాపై అదితి విజయం సాధించింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన తుది పోరులో 149-147 పాయింట్ల తేడాతో అండ్రియా బెకెరా (మెక్సికో)పై అదితి అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచే తనదైన జోరు ప్రదర్శించిన అదితి చెక్కుచెదరని గురితో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆరోసీడ్గా బరిలోకి దిగిన అదితి తొలిరౌండ్లోనే 30-29 ఆధిక్యం కనబరిచింది. తొలి నాలుగు రౌండ్లలో ఏకంగా 12 సార్లు కచ్చితమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ పదేసి పాయింట్లను తన ఖాతాలో వేసుకుని అదితి భారత్కు పసిడి పతకాన్ని ఖాయం చేసి చరిత్ర లిఖించింది. ఇదే విభాగంలో పోటీపడ్డ జ్యోతి సురేఖ కాంస్య పతకం దక్కించుకుంది. పురుషుల విభాగంలో ఓజాస్ దియోతలె స్వర్ణం నెగ్గాడు. ఈ చాంపియన్షిప్లో భారత్ మొత్తం 4 మెడల్స్ (3 స్వర్ణాలు, ఒక కాంస్యం) గెలుచుకొని అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకుంది.