IND Vs SA Test | జస్ప్రీత్ బుమ్రా సిక్సర్.. రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత్ చరిత్రాత్మక విజయం
పేస్‌కు స్వర్గధామమైన పిచ్‌పై మన బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా విజయంతో ముగించింది. ఇప్పటి వరకు ఆసియా జట్టు టెస్టు విజయం సాధించని కేప్‌టౌన్‌లో రోహిత్ సేన గర్జించింది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లతో రెచ్చిపోతే.. ఈసారి ఆ బాధ్యత బుమ్రా తీసుకున్నాడు.
- 107 ఓవర్లలో.. తక్కువ ఓవర్లలో ముగిసిన టెస్టుగా రికార్డు
- ఐదు సెషన్లలోనే ఖేల్ ఖతం!
- కేప్‌టౌన్‌లో గెలిచిన తొలి ఆసియా జట్టు
అంచనాలు తప్పలేదు.. సంచలనాలు నమోదు కాలేదు! అంతా అనుకున్నట్లే.. రెండో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది!
తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ సిరాజ్ సత్తాచాటితే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆ బాధ్యత బూమ్ బూమ్ బుమ్రా తీసుకున్నాడు. దీంతో సఫారీ జట్టు తక్కువ పరుగులకే చాప చుట్టేయగా.. స్వల్ప లక్ష్యాన్ని మనవాళ్లు మూడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఫలితంగా కేప్‌టౌన్‌లో టెస్టు గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా రికార్డుల్లోకెక్కగా.. 642 బంతుల్లోనే ముగిసిన ఈ పోరు సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో ఫలితం తేలిన మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది.
మాస్టర్‌మైండ్ ధోనీ తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ సమం చేసుకున్న భారత కెప్టెన్‌గా రోహిత్ నిలువగా.. బౌలర్లు బెంబేలెత్తించిన చోట మార్క్మ్ ఆణిముత్యంలాంటి శతకంతో అదరగొట్టాడు. మొత్తంగా ఈ పర్యటనలో భారత జట్టు వన్డే సిరీస్ గెలుచుకొని.. టెస్టు, టీ20 సిరీస్‌లను ‘డ్రా’ చేసుకొని సగర్వంగా ఇంటిబాట పట్టింది!!
IND Vs SA Test | కేప్‌టౌన్: పేస్‌కు స్వర్గధామమైన పిచ్‌పై మన బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా విజయంతో ముగించింది. ఇప్పటి వరకు ఆసియా జట్టు టెస్టు విజయం సాధించని కేప్‌టౌన్‌లో రోహిత్ సేన గర్జించింది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లతో రెచ్చిపోతే.. ఈసారి ఆ బాధ్యత బుమ్రా తీసుకున్నాడు. ఫలితంగా రెండు రోజుల్లో ముగిసిన పోరులో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది. ఓవర్‌నైట్ స్కోరు 62/3తో గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 176 పరుగులకు ఆలౌటైంది. మార్క్మ్ (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. బెడింగ్హామ్ (11), వెరినె (9), జాన్సెన్ (11), కేశవ్ (3) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో బుమ్రా 6, ముఖేశ్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 79 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా..12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (28) ధనాధన్ షాట్లు ఆడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (16 నాటౌట్) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును ఎల్గర్, బుమ్రా పంచుకున్నారు. ఈ మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికిగిన ఎల్గర్‌కు భారత జట్టు సభ్యులు సంతకాలు చేసిన జెర్సీని ప్రత్యేకంగా బహుకరించారు. ఈ పర్యటనలో భాగంగా మొదట జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను టీమ్ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే.
♦ మళ్లీ నంబర్‌వన్ ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ తిరిగి అగ్రస్థానానికి చేరింది. తొలి మ్యాచ్ ఓటమి తర్వాత ఆరో స్థానానికి పడిపోయిన టీమ్ఇండియా టాప్కు దూసుకెళ్లగా.. దక్షిణాఫ్రికా ఆ తర్వాతి స్థానంలో ఉంది.
♦ టెస్టు క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో (642) ముగిసిన టెస్టు ఇదే. 1932లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన పోరు (656 బంతుల్లో ముగిసింది) రెండో స్థానంలో ఉంది.
♦ కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై ఒక ఆసియా జట్టు టెస్టు విజయం సాధించడం ఇదే తొలిసారి.
♦ దక్షిణాఫ్రికాలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌లో భారత్ నెగ్గడం ఇదే తొలిసారి.
♦ దక్షిణాఫ్రికా గడ్డపై ధోనీ తర్వాత టెస్టు సిరీస్‌ను ‘డ్రా’ చేసుకున్న రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు.
♦ ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయకుండా భారత్ టెస్టు మ్యాచ్ గెలువడం ఇది రెండోసారి.
♦ రెండు రోజుల్లో ముగిసిన టెస్టుల్లో భారత్ భాగస్వామి కావడం ఇది మూడోసారి. గతంలో అఫ్గానిస్థాన్‌తో (2018లో), ఇంగ్లండ్‌తో (2021లో) మ్యాచ్‌లు కూడా రెండు రోజుల్లోనే ముగిశాయి. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది తొమ్మిదోసారి.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 55;
భారత్ తొలి ఇన్నింగ్స్: 153;
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 176 (మార్క్మ్ 106; బుమ్రా 6/61, ముఖేశ్ 2/56);
భారత్ రెండో ఇన్నింగ్స్: 80/3 (జైస్వాల్ 28; జాన్సెన్ 1/15).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

