గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 22, 2020 , 23:37:17

చెస్‌ చిచ్చరపిడుగు

చెస్‌ చిచ్చరపిడుగు

  • గ్రాండ్‌మాస్టర్‌ హోదాకు అడుగుదూరంలో శ్రీశ్వాన్‌

ప్రపంచానికి చదరంగాన్ని పరిచయం చేసిన మనదేశం నుంచి మరో చిచ్చరపిడుగు దూసుకువస్తున్నాడు. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా 14 ఏండ్ల వయసులోనే ఎన్నో ఘనతలు సొంతంచేసుకున్న ఈ చిన్నోడు.. ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదాను ఖాతాలో వేసుకొని.. గ్రాండ్‌ మాస్టర్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఏడేండ్ల వయసులో సరదాగా మొదలెట్టిన 64 గళ్ల ఆట.. అతడి జీవితాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది. పట్టుమని పదేండ్లు నిండకముందే 2 వేల రేటింగ్‌ పాయింట్లు సాధించిన ఈ తెలంగాణ యంగ్‌ గన్‌.. పసి ప్రాయంలోనే ముంబై ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ (2016)లో ఉక్రెయిన్‌కు చెందిన గ్రాండ్‌ మాస్టర్‌ సివుక్‌ విటాలీని చిత్తు చేసి ఔరా అనిపించాడు. ఎప్పటికైనా ప్రపంచ చాంపియన్‌గా నిలువడమే తన డ్రీమ్‌ అంటున్న ఆ బుడతుడు మరెవరో కాదు.. ఇందూరు (నిజామాబాద్‌)కు చెందిన మర్లిశికారి శ్రీశ్వాన్‌. ఆరాధ్య ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌లా.. నిలకడగా భారత్‌కు విజయాలు అందించడమే లక్ష్యమంటున్న ఈ బుడ్డోడి ఘనతలను ఓసారి పరిశీలిస్తే.. 

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ఇంట్లో ఆటవిడుపుగా తల్లి పావులు కదపడం నేర్పితే.. ఆసక్తిగా గమనించిన చిన్నోడు.. చూస్తుండగానే తన ఎత్తులు పైఎత్తులతో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. పాల్గొన్న ప్రతీ టోర్నీలో పతకం నెగ్గడమే లక్ష్యంగా బరిలో దిగే ఈ బుడ్డోడి ఖాతాలో ఇప్పటికే లెక్కకు మిక్కిలి ట్రోఫీలు ఉన్నాయి. రెంజల్‌కు చెందిన అశోక్‌ కుమార్‌, రాధ దంపతుల ఏకైక సంతానమైన శ్రీశ్వాన్‌.. బాచుపల్లిలోని కెనడీ హైస్కూల్లో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదవుతున్నాడు. మూడో తరగతిలో తొలిసారి చెస్‌బోర్డ్‌పై కూర్చున్న అతడు.. పాఠశాల స్థాయిలో నిర్వహించిన టోర్నీలో సత్తాచాటాడు. అది గుర్తించిన ఉపాధ్యాయులు మరింత చేయూతనివ్వడంతో.. అండర్‌-9 విభాగంలో రాష్ట్ర స్థాయిలో పోటీపడ్డాడు. ఆట మొదలెట్టిన ఏడాదిలోపే.. తన ఏజ్‌ కేటగిరీలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిన ఈ చిన్నోడు.. ఆ తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో మెరుపులు మెరిపించాడు.

దాతల సాయంతోనే ఇక్కడి దాకా..

దాతల సాయంతోనే ఈ స్థాయికి చేరిన శ్రీశ్వాన్‌.. 2018 డిసెంబర్‌ 30న తొలి ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎమ్‌) నార్మ్‌ ఖాతాలో వేసుకున్నాడు. వారం తిరగకముందే రెండో నార్మ్‌ కూడా దక్కించుకున్నాడు. గతేడాది స్పెయిన్‌లో జరిగిన ఒబెర్ట్‌ ఇంటర్నేషనల్‌ మార్టీ టోర్నమెంట్‌ (బార్సిలోనా)లో మూడో ఐఎమ్‌ నార్మ్‌ దక్కించుకొని ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదా సొంతం చేసుకున్నాడు. అయితే అక్కడి వరకు అప్రతిహతంగా సాగిన అతడి జైత్రయాత్రకు ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో కాస్త బ్రేక్‌ పడింది. రేటింగ్‌ పాయింట్లు పొందాలంటే తనకంటే మెరుగైన ఆటగాళ్లతో ఆడాల్సి రావడం.. ఇందుకు అంతర్జాతీయ టోర్నీలే మార్గం కావడం శ్రీశ్వాన్‌ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారింది. స్నేహితులు అందించిన సాయంతో కొడుకును ఇక్కడి వరకు తేగలిగిన తండ్రి.. ఇకపై అతడిని టోర్నీలకు పంపించాలంటే ఆర్థిక ఇబ్బందులతో తటపటాయిస్తున్నాడు.

మరో 38 పాయింట్లే..

గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకోవడమే తక్షణ కర్తవ్యంగా ముందుకు సాగుతున్న శ్రీశ్వాన్‌.. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆసియా యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌-14 విభాగంలో స్వర్ణం నెగ్గిన ఈ ఇందూరు చిన్నోడు.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో మూడు పతకాలను తన పేరిట రాసుకున్నాడు. ప్రస్తుతం 2462 రేటింగ్‌ పాయింట్లతో ఉన్న శ్రీశ్వాన్‌.. మరో 38 పాయింట్లు సాధిస్తే.. జీఎమ్‌ నార్మ్‌ సొంతం చేసుకోనున్నాడు.  


ఆన్‌లైన్‌లో ఆడుతూ.. 

నిత్యం ఏడెనిమిది గంటలు బోర్డుపై గడిపే.. శ్రీశ్వాన్‌ అందులో కనీసం రెండు గంటలైనా.. ఆన్‌లైన్‌ చెస్‌ ఆడుతా అంటున్నాడు. ‘ఆన్‌లైన్‌లో చెస్‌ ఆడేందుకు రోజుకు రెండేసి గంటలు కేటాయిస్తా. దీంతో ఆటకు సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోగలుగుతా. మ్యాచ్‌ ఎలా మొదలుపెట్టాలి.. ఆ తర్వాత ఎలాంటి వ్యూహాలు పన్నాలనే వాటి గురించి తెలుసుకుంటా. పరీక్షల సమయంలో ఆటను పక్కనపెట్టి పూర్తిగా చదువుపై దృష్టి పెడుతా.  ఉక్రెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ గోలోషచపోవ్‌తో ఆన్‌లైన్‌లో తరచూ చర్చిస్తా’అని ధైర్యంగా చెబుతున్న ఈ చిన్నోడికి మరింత సాయం అందితే.. రాష్ర్టానికి, దేశానికి మంచి పేరు తేవడం ఖాయమే. 


యూరప్‌, అమెరికా ఆటగాళ్లతో ఆడటం కొంచెం కష్టం. అయినా వారిని ఓడించే ఎత్తులు నా దగ్గర ఉన్నాయి. అంతర్జాతీయ టోర్నీలు ఆడితేనే రేటింగ్‌ పాయింట్లు పెంచుకోగలం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనూ చెస్‌ శిక్షణ పొందుతున్నా. 

- శ్రీశ్వాన్‌


logo
>>>>>>