నిప్పులు చెరిగిన రబడ, నోర్జే l బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా విజయం
అబుదాబి: పేసర్లు విజృంభించడంతో పొట్టి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మూడో విజయం నమోదు చేసుకుంది. సూపర్-12లో భాగంగా జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 18.2 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌటైంది. మెహెదీ హసన్ (27) టాప్ స్కోరర్ కాగా.. నయీమ్ (4), సౌమ్య సర్కార్ (0), ముష్ఫికర్ రహీమ్ (0), మహ్ముదుల్లా (3), అఫిఫ్ (0) ఘోరంగా విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, అన్రిచ్ నోర్జే చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. తబ్రేజ్ షంసీకి రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 13.3 ఓవర్లలో 4 వికెట్లకు 86 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ టెంబా బవుమా (31 నాటౌట్) సత్తాచాటాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. బంగ్లా టాపార్డర్‌ను దెబ్బ కొట్టిన రబడకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు:
బంగ్లాదేశ్: 18.2 ఓవర్లలో 84 ఆలౌట్ (మెహిదీ హసన్ 27; నోర్జే 3/8, రబడ 3/20), దక్షిణాఫ్రికా: 13.3 ఓవర్లలో 86/4 (బవుమా 31 నాటౌట్; తస్కీన్ అహ్మద్ 2/18).