గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 08, 2020 , 23:23:29

గజ్వేల్‌కు రైలొచ్చింది

గజ్వేల్‌కు రైలొచ్చింది
  • మనోహరాబాద్‌- గజ్వేల్‌ ట్రయల్న్‌ విజయవంతం
  • రైలు కూతతో సంబరపడ్డ ప్రజలు
  • రైలింజన్‌ ముందు సెల్ఫీలతో సందడి

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ/ గజ్వేల్‌ అర్బన్‌: గజ్వేల్‌కు రైలొచ్చింది. ఉదయం నుంచి దినపత్రికల్లో, వాట్సాప్‌ సందేశాల్లో గజ్వేల్‌కు శనివారం రైలొస్తుందన్న సందేశాలతో ప్రజలు ఉత్కంఠతతో ఉదయం నుంచి ఎదురు చూశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైలు ఎప్పుడొస్తుందా అంటూ చూశారు. సాయంత్రం 5గంటలకు గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌కు ట్రయల్‌ రన్‌ రైలింజన్‌ చేరుకున్నది. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలంతా రైలింజన్‌ స్టేషన్‌కు చేరుకోవడంతోనే సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సంబరపడ్డారు. శుక్రవారం మనోహరాబాద్‌ - నాచారం మధ్య అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించిన అనంతరం రైలింజన్‌ తిరిగి మనోహరాబాద్‌కు చేరుకుంది. శనివారం తిరిగి మనోహరాబాద్‌  నుంచి గజ్వేల్‌ వరకు అధికారులు రైలింజన్‌తో ట్రయల్న్‌ నిర్వహించారు. ట్రయల్‌ రన్‌ పూర్తయిన వెంటనే మళ్లీ రైలింజన్‌ను మనోహరాబాద్‌కు తరలించారు. కాగా ఫిబ్రవరి నెలాఖరు వరకు ట్రయల్న్‌ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చిలో రైల్వే సేవలు ప్రారంభమవుతాయని సూచనప్రాయంగా తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుండడంతో ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ పులకించిపోయారు. 


మరింత విస్తరించనున్న పట్టణం

రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుండడంతో గజ్వేల్‌ పట్టణం మరింత విస్తరించనున్నది. అలాగే వ్యాపార, వాణిజ్యంగా కూడా మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే రైల్వే నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో రియల్‌ వెంచర్లు భారీ మొదలయ్యాయి. పక్కనే పాండవుల చెరువు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఏర్పాటుతో ఆ ప్రాంతమంతా భూముల విలువలు పెరిగిపోయాయి. 


రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సులభంగా మారిన రైల్వే లైన్‌ ప్రక్రియ

రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టే దిశలో కేంద్రానికి ప్రతిపాదనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మెలిక పెట్టింది. భూ సేకరణను పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభు త్వం చేయగలిగితే తాము రైల్వేలైన్‌ నిర్మాణానికి మంజూరు చేస్తామనడంతో, సీఎం కేసీఆర్‌, అధికారులతో వెనువెంటే భూసేకరణ పూర్తి చేయగా, నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. మనోహరాబాద్‌ - కొత్తపల్లి రైల్వేలైన్‌ పనుల్లో మొదటి దశలో భాగంగా గజ్వేల్‌ వరకు పనులు పూర్తయ్యాయి. దీంతో ఢిల్లీ, కలకత్తా లాంటి పట్టణాలకు రైలు మార్గం సులభంగా మారబోతుంది. మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు రూ.1160.47కోట్ల వ్యయంతో 151.36 కిలోమీటర్ల పొడవైన బ్రాడ్‌గేజ్‌ లైన్‌ నిర్మాణం జరుగుతుంది. కరీంనగర్‌ నుంచి హైద్రాబాద్‌ వెళ్లడానికి ఇప్పటివరకు రోడ్డు మార్గమే ఉండగా, రైల్వే లైన్‌ పూర్తయితే మరింత చౌకగా మారి ప్రయాణభారం తగ్గనున్నది. రైల్వే లైన్‌కు మొదటి విడుతలో రూ.350 కోట్లకు పైగా నిధులు విడుదల చేయగా ఇప్పటివరకు రూ.325 కోట్లు, కొత్త బడ్జెట్‌లో రూ.235కోట్లు విడుదల కావడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి.


logo