Wipro | ఐటీ దిగ్గజం విప్రో.. సంస్థ పురోభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో సీనియర్ లెవెల్ ప్రమోషన్లు ప్రకటించింది. నాయకత్వాన్ని బలపరిచేందుకు, ప్రతిభావంతులైన నిపుణులను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, ఎగ్జిక్యూటివ్‌లు కలిపి 73 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించింది. వారిలో 12 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా, 61 మంది ఎగ్జిక్యూటివ్‌లను వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. సంస్థలో సరైన నాయకత్వాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. విప్రో చరిత్రలోనే తమ ఎగ్జిక్యూటివ్‌లకు ప్రమోషన్లు కల్పించడం ఇది అత్యధికం అని పేర్కొంది.
`మేం అభివృద్ధి చెందాలంటే, సరైన నాయకత్వం కలిగి ఉండటం ముఖ్యం. విప్రో చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో వైస్‌ప్రెసిడెంట్ ప్రమోషన్లు కల్పించాం. సిబ్బంది శక్తి సామర్థ్యాలు, పనితీరుకు ఈ ప్రమోషన్లు గుర్తింపునిస్తాయి` అని విప్రో ఓ ప్రకటనలో తెలిపింది. తమ సిబ్బందికి త్రైమాసికం వారీగా ప్రమోషన్లు కల్పించడంతోపాటు వేతనాలు పెంచాలని గతేడాది జూలైలో విప్రో నిర్ణయించింది. వివిధ బాండ్ల వారీగా 10 వేల మందికి పైగా ఉద్యోగుల వేతనాలు పెంచేసింది.
`మా క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ప్రతిభావంతులైన సిబ్బందిని కాపాడుకోవడంతోపాటు వారిలో స్కిల్స్ డెవలప్ చేయడానికి సంస్థ ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10 వేల మందికి పైగా ఉద్యోగులు ప్రమోషన్లు అందుకున్నారు` అని విప్రో సీఈవో కం ఎండీ థెర్రీ డెలాపోర్ట్ చెప్పారు. `ఉద్యోగుల వలసకు అడ్డుకట్ట వేసేందుకు వరుసగా మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ప్రమోషన్లు కల్పించాం` అని చెప్పారు.
గతేడాది విప్రో నుంచి నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలిగారు. వారిలో సంస్థ జపాన్ బిజినెస్ హెడ్, ఆస్ట్రేలియా అండ్ న్యూజీలాండ్ మేనేజింగ్ డైరెక్టర్, మిడిల్ ఈస్ట్ రీజియన్ బిజినెస్ హెడ్ ఉన్నారు. అమెరికాస్ 2 స్ట్రాటర్జిస్ మార్కెట్ యూనిట్లో సీఈవోగా పని చేసిన అంగన్ గుహా గతేడాది అక్టోబర్‌లో సంస్థ నుంచి వెళ్లిపోయారు.