Decentraland | అసలు డీసెంట్రాలాండ్ అంటే ఏంటి? వర్చువల్ లాండ్ ఏంటి? కోట్లు పెట్టి వర్చువల్ లాండ్‌ను కొనడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు ఆశ్చర్యపోయినా.. ఆశ్చర్యపోకున్నా ఇది నిజం. త్వరలో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఉన్న రియల్ ప్రపంచానికి మించిన వర్చువల్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది. దాన్ని సుసాధ్యం చేస్తోంది మెటావర్స్. ఇప్పటికే మెటావర్స్ ప్రాజెక్టును పలు ఎంఎన్‌సీలు మొదలుపెట్టాయి.
ఫేస్బుక్ కూడా ఇటీవలే మెటావర్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఆ ప్రాజెక్ట్ కోసమే కంపెనీ పేరును కూడా మెటాగా మార్చింది. మరో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా మెటావర్స్ ప్రాజెక్ట్‌ను టేకప్ చేసింది. ఇలా పలు ఎంఎన్‌సీలు మెటావర్స్ మీద వర్క్ చేస్తుండటంతో అసలు మెటావర్స్ అంటే ఏంటి అనేదానిపై చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.
ఒక వర్చువల్ ప్రపంచాన్ని క్రియేట్ చేసి.. వర్చువల్ రియాల్టీ, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ ద్వారా ఆ వర్చువల్ ప్రపంచాన్ని యాక్సెస్ చేసుకోవడమే మెటావర్స్. ఇదో కల్పిత ప్రపంచం అన్నమాట. అందులో షాపింగ్ చేసుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు. సినిమా చూడొచ్చు. మెటావర్స్‌లో ఏం చేయాలన్నా.. ఎన్ఎఫ్టీ ఫార్మాట్లో చేయాల్సి ఉంటుంది. అక్కడ మన కరెన్సీ కాకుండా.. క్రిప్టోకరెన్సీని ఉపయోగించి కొనుగోళ్లు చేయొచ్చు.
అలాంటి ఒక ప్రాజెక్టే డీసెంట్రాలాండ్. ఇది వర్చువల్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్. ఇది ఎథీరియం ఆధారిత 3డీ వర్చువల్ ప్రపంచం. అక్కడ వర్చువల్‌గా లాండ్‌ను కొనుక్కోవచ్చు.. అమ్ముకోవచ్చు. కొనుగోలు చేసిన వర్చువల్ లాండ్లో మార్కెట్ ప్లేస్‌ను సెట్ చేసుకోవచ్చు. గేమ్స్ డిజైన్ చేసుకోవచ్చు. డీసెంట్రాలాండ్లో మూడు రకాల టోకెన్స్ ఉంటాయి. MANA, LAND, Estate.. ఈ మూడు టోకెన్స్ ఆధారంగా అక్కడ లాండ్‌ను కొనుగోలు చేయొచ్చు. పబ్లిక్ ఎవరైనా అక్కడ లాండ్ కొనుక్కునే అవకాశాన్ని జనవరి 2020 నుంచే ప్రారంభించారు.
డీసెంట్రాలాండ్లో వర్చువల్ ప్రపంచాన్ని అవతార్ ద్వారా యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే డీసెంట్రాలాండ్ వర్చువల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంటారో వాళ్ల అవతార్ అందులోకి ప్రవేశిస్తుంది. ఆ అవతార్ ఆ ప్రపంచంలో విహరిస్తుంది. అందులో లిస్ట్ అయి ఉండే డిజిటల్ ఆర్ట్‌ను కొనుగోలు చేయాలంటే మాత్రం డిజిటల్ టోకెన్స్ ఉండాల్సిందే. వాస్తవిక ప్రపంచం ఎలా ఉంటుందో అలాంటి ప్రపంచాన్నే పోలిన వర్చువల్ ప్రపంచాన్ని అందులో అనుభూతి పొందొచ్చు.
ఇప్పటికే యూఎస్‌కు చెందిన అతి పెద్ద బ్యాంక్ జేపీమోర్గాన్.. Onyx Lounge పేరుతో డీసెంట్రాలాండ్ వర్చువల్ ప్రపంచంలో లాంజ్‌ను క్రియేట్ చేసింది. నవంబర్ 2021న టోకెన్స్ డాట్ కామ్ కంపెనీకి చెందిన సబ్ బ్రాండ్ రూ.18.15 కోట్లతో డీసెంట్రాలాండ్లో ప్లాట్ కొనుగోలు చేసింది.
ప్రస్తుతం డీసెంట్రాలాండ్లో 90601 వర్చువల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి అన్నీ కూడా లాండ్ ఎన్ఎఫ్టీ ఫార్మాట్లో అందుబాటులో ఉంటాయి. MANA అనే డిజిటల్ టోకెన్ ద్వారా అక్కడ లాండ్‌ను కొనొచ్చు. అందులో తమకు నచ్చిన వర్చువల్ సిటీని డిజైన్ చేసుకోవచ్చు. లాండ్ ఓనర్‌షిప్‌ను మెయిన్‌టెన్ చేయడం కోసం ఎథీరియం బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎథీరియం వాలెట్ ద్వారా ఆ డిజిటల్ టోకెన్‌ను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది.