న్యూఢిల్లీ : యూజర్లకు మెరుగైన అనుభూతి కలిగించేందుకు హైఎండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోందని తాజా లీకుల ద్వారా వెల్లడైంది. ఐఫోన్ 14 సిరీస్‌లో హై ఎండ్ కెమెరా లెన్స్‌ల కోసం చైనా కంపెనీని పక్కనపెట్టిన యాపిల్ ఎల్జీ ఇన్నోటెక్తో కలిసి పనిచేసేందుకు యాపిల్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. చైనా సరఫరాదారులతో యాపిల్ కొన్ని నాణ్యతా పరమైన సమస్యలు ఎదుర్కొంటుండటంతో కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
గత వెర్షన్‌కు కంపెనీ చెల్లింపులతో పోలిస్తే హైఎండ్ కెమెరా విడిపరికరాలపై యాపిల్ మూడు రెట్లు అధికంగా వెచ్చిస్తోంది. యాపిల్ ఫోన్లలో తొలిసారిగా ఐఫోన్ 14 ఫ్రంట్ కెమెరా ఆటోఫోకస్ సదుపాయాన్ని కలిగిఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఐఫోన్ 14 సిరీస్‌లో నాలుగు మోడల్స్‌ను కంపెనీ లాంఛ్ చేస్తుండగా అన్ని ఫోన్లలో ఆటోఫోకస్ సౌకర్యం ఉంటుంది.
బ్రైటర్ ఫోటోల కోసం కెమరాలో వైడర్ ఎఫ్\1.9 అపర్చర్ ఉంటుందని టెక్ అనలిస్ట్ మింగ్ చి కు ఇటీవల వెల్లడించారు. ఆటోఫోకస్ అప్డేట్తో వీడియో కాల్స్ కూడా మెరుగైన నాణ్యతతో కూడి ఉంటాయి. ఐఫోన్ 14 ఫ్రంట్ కెమెరా కోసం ఎల్జీ ఇన్నోటెక్ పెద్ద ఎత్తున ఉత్పత్తిని ప్రారంభించింది. ఇక ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల ధరలను యాపిల్ గణనీయంగా పెంచవచ్చని భావిస్తున్నారు.