Acer Swift Lite 14 AI PC | ప్రస్తుతం అంతా ఏఐ యుగం నడుస్తోంది. అందులో భాగంగానే చాలా మంది ఏఐ ని ఉపయోగిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ప్రవేశిస్తోంది. స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా కంప్యూటర్లలోనూ ఏఐ ఫీచర్లను కంపెనీలు అందిస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా ఏసర్ కూడా ఓ నూతన ఏఐ ల్యాప్ టాప్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. స్విఫ్ట్ లైట్ 14 పేరిట ఓ నూతన ఏఐ ల్యాప్‌టాప్‌ను ఏసర్ సంస్థ భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ల్యాప్‌టాప్‌లో ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ కలిగిన వెబ్ క్యామ్‌ను ఇచ్చారు. ప్రైవసీ షటర్ అనే సదుపాయం కూడా ఉంది. ఏఐ కోసం ప్రత్యేకంగా కో పైలట్ కీని ఏర్పాటు చేశారు. దీని సహాయంతో మైక్రోసాఫ్ట్ ఏఐ అసిస్టెంట్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
ఈ ల్యాప్‌టాప్ కేవలం 15.9 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. 1.1 కిలోల బరువు ఉంటుంది. 14 ఇంచుల ఓలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. తెరపై నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ వినియోగదారులకు లభిస్తుంది. దీని సహాయంతో ఏఐ ద్వారా చాలా సులభంగా పనులు చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగానే వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.
ఈ ల్యాప్‌టాప్‌లో 32జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 1టీబీ వరకు ఎస్ఎస్డీని అందిస్తున్నారు. 50 వాట్ అవర్ బ్యాటరీ కూడా ఉంది. యూఎస్బీ టైప్ సి పోర్టులను ఏర్పాటు చేశారు. డిస్ప్లే పోర్ట్‌తోపాటు యూఎస్బీ టైప్ ఎ పోర్టు, హెచ్డీఎంఐ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉన్నాయి. చార్జింగ్‌ను యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా పెట్టుకోవాల్సి ఉంటుంది. వైఫై 6తోపాటె బ్లూటూత్ 5.1ను ఇందులో అందిస్తున్నారు.
ఏసర్ స్విఫ్ట్ లైట్ 14 ఏఐ పీసీని లైట్ సిల్వర్, సన్‌సెట్ కాపర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.62,999గా ఉంది. దీన్ని ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు, ఏసర్ ఆన్లైన్ స్టోర్, అన్ని రిటెయిల్ స్టోర్స్‌లోనూ విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసర్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుధీర్ గోయెల్ మాట్లాడుతూ ప్రస్తుతం చాలా మంది యూజర్లు ఏఐ ఫీచర్లను కోరుకుంటున్నారని అన్నారు. అందుకు అనుగుణంగానే ఈ ల్యాప్ టాప్‌ను అధునాతన హార్డ్ వేర్, సాఫ్ట్‌వేర్‌తో తీర్చిదిద్దినట్లు వివరించారు. వినియోగదారులకు కావల్సిన ఏఐ ఫీచర్లు ఇందులో లభిస్తాయని తెలిపారు.