Acer Predator Helios Neo 16 | మీరు గేమింగ్ ప్రియులా ? లేదా కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్నారా ? డిజైనింగ్ రంగంలో ఉన్నారా..? అయితే మీ కోసమే ఏసర్ పలు అద్భుతమైన ఏఐ ల్యాప్‌టాప్‌లను భారత్‌లో లేటెస్ట్గా లాంచ్ చేసింది. రెండు నూతన ఏఐ ల్యాప్ టాప్ లను విడుదల చేసినట్లు ఏసర్ తెలియజేసింది. ప్రిడేటర్ హీలియోస్ నియో 16 ఏఐ, ప్రిడేటర్ హీలియోస్ నియో 16ఎస్ ఏఐ పేరిట ఈ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేశారు. ప్రిడేటర్ హీలియోస్ నియో 16 ఏఐ ల్యాప్ టాప్ ను ప్రత్యేకించి గేమింగ్ ప్రియుల కోసం తీర్చిదిద్దారు. డిజైన్ కూడా అలాగే ఉంటుంది. ఇది అద్భుతమైన ప్రదర్శనను ఇస్తుంది. నియో 16ఎస్ ఏఐ ల్యాప్‌టాప్‌ను అత్యంత స్లిమ్‌గా ఉండేలా తీర్చిదిద్దారు. ఇది కంటెంట్ క్రియేటర్ల కోసం అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ రెండు మోడల్స్‌లోనూ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్స్‌ను అమర్చారు. ఎన్వీడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5070 టీఐ గ్రాఫిక్ కార్డులను అందిస్తున్నారు. అందువల్ల ఈ రెండు ల్యాప్టాప్స్ కూడా గేమింగ్ ప్రియులు, కంటెంట్ క్రియేటర్లకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. వీటిల్లో డీఎల్ఎస్ఎస్ 4, 4వ జనరేషన్ రే ట్రేసింగ్, ఎన్వీడియా రిఫ్లెక్స్ 2 వంటి టెక్నాలజీలను అందిస్తున్నారు. అందువల్ల విజువల్ ఎఫెక్ట్స్ లేదా గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు. హీలియోస్ నియో 16 ఏఐ ల్యాప్‌టాప్‌లో 16 ఇంచుల ఐపీఎస్ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 240 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. హీలియోస్ నియో 16ఎస్ ఏఐ ల్యాప్ టాప్లోనూ 16 ఇంచుల ఓలెడ్ డిస్ప్లే ఉంది. ఈ రెండింటిలోనూ అద్భుతమైన బ్రైట్ నెస్ ఫీచర్లను అందిస్తున్నారు. అందువల్ల ల్యాప్ టాప్లకు చెందిన తెరలపై అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
ఈ ల్యాప్‌టాప్‌లలో గరిష్టంగా 64జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 2టీబీ వరకు ఎస్ఎస్డీని పొందవచ్చు. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అందిస్తున్నారు కనుక ల్యాప్‌టాప్‌లను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత సులభంగా హీట్‌కు గురి కావు. ఈ ల్యాప్‌టాప్‌లలో 4జోన్ ఆర్జీబీ బ్యాక్ లైట్ కీబోర్డును ఏర్పాటు చేశారు. ఆర్జీబీ లైట్ కవర్ లోగో ఉంటుంది. థండర్ బోల్ట్ 4, హెచ్డీఎఎంఐ 2.1, యూఎస్బీ టైప్ సి పోస్టులను ఈ ల్యాప్‌టాప్‌లలో అందిస్తున్నారు. అలాగే వైఫై 6 లభిస్తుంది. బ్లూటూత్ 5.4 కూడా అందుబాటులో ఉంది. ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ నియో 16 ఏఐ ల్యాప్‌టాప్‌లో 90 వాట్ అవర్ కెపాసిటీ కలిగిన 4 సెల్ బ్యాటరీని అందిస్తున్నారు. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏసర్ ప్రిడేటర్ హీలియోఎస్ నియో 16ఎస్ ఏఐ ల్యాప్‌టాప్‌లోనూ ఇవే ఫీచర్లను అందిస్తున్నారు. కానీ బ్యాటరీ 76 వాట్ అవర్ ఉంది.
ప్రిడేటర్ హీలియోస్ నియో 16ఎస్ ఏఐ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.1,54,999 ఉండగా, టాప్ మోడల్ ధర రూ.2,09,999గా ఉంది. అలాగే ప్రిడేటర్ హీలియోస్ నియో 16 ఏఐ ల్యాప్ టాప్ ధర రూ.2,29,999గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లను ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు ఏసర్ ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ స్టోర్స్, ఇతర ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.