మంగళవారం 02 జూన్ 2020
Sangareddy - Mar 10, 2020 , 00:25:56

కార్పొరేట్‌కు దీటుగా డీసీసీబీ

కార్పొరేట్‌కు దీటుగా డీసీసీబీ

కొండపాక: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో డీసీసీబీ బ్యాంకు కార్పొరేట్‌ స్థాయి బ్యాంకులకు దీటుగా పని చేస్తూ సామాన్యుడి సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందిస్తోంది. గడిచిన ఐదేండ్లలో డీసీసీబీ రికార్డు స్థాయి లావాదేవీలను నిర్వహించి, 400 కోట్ల టర్నోవర్‌ నుంచి 1200 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. 2015లో చిట్టి దేవేందర్‌ రెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగా, నాటి నుంచి నేటి వరకు డీసీసీబీ మునుపెన్నడూ లేనంతగా ప్రజలకు అత్యంత చేరువగా వెళ్లి సేవలందిస్తున్నది. పరిమితమైన రుణాల జాబితాను పక్కన పెట్టి, పలు రకాల కొత్త రుణాలు ఇస్తూ డీసీసీబీ బ్యాంక్‌ ఆర్థిక రంగంలో తనదైన ఇమేజ్‌ను తయారు చేసుకున్నది.


అన్ని రకాల రుణాలు..

డీసీసీబీ బ్యాంకు గతంలో ఎల్టీ లోన్లు, వ్యవసాయ రుణాలు, బంగారంపై రుణాలు మాత్రమే అందించేది. ప్రస్తుతం డీసీసీబీ తన దృక్పథాన్ని మార్చుకొని, మిగతా బ్యాంకుల మాదిరిగానే రుణాలను అందించి ఆదుకుంటున్నది. చదువుకునే విద్యార్థులకు, గొర్రెలు, బర్రెల పెంపకానికి, స్వయంకృషి పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు, ఇండ్ల నిర్మాణానికి, మహిళా స్వయం సమృద్ధి సంఘాలకు రుణాలకు అందిస్తున్నది. దీంతో పాటుగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రుణాలను, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు ఇస్తున్నది. అతి తక్కువ వడ్డీతో ఎక్కువ మంది ఖాతాదారులను తన వైపు తిప్పుకున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు డీసీసీబీ బ్యాంకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతున్నది.


ఉమ్మడి జిల్లాలో 44 డీసీసీబీ బ్యాంకులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో డీసీసీబీ తన పరిధిని విస్తరించుకుంటూ ప్రతి పల్లెకు చేరింది. గతంలో కొన్ని పట్టణాలకు మాత్రమే పరిమితంగా ఉండే డీసీసీబీ బ్యాంకు, నేడు తన సంఖ్యను పెంచుకొని బ్యాంకింగ్‌ రంగంలో ముందడుగు వేస్తున్నది. 2015లో 23 బ్రాంచీలతో సేవలు అందించి, ప్రస్తుతం 44 బ్రాంచీలకు చేరుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 22వ స్థానంలో మెదక్‌ జిల్లా డీసీసీబీ బ్యాంకు ఉండగా, స్వరాష్ట్రంలో 2వ స్థానానికి చేరుకుంది. 67వేల క్రెడిట్‌ కార్డులను జారీ చేసి, జాతీయ స్థాయి అవార్డును సాధించింది. 


ఆన్‌లైన్‌లో సేవలు..

డీసీసీబీ బ్యాంకు ఆన్‌లైన్‌ సేవలతో ఖాతాదారులకు మరింత చేరువైంది. తన లావాదేవీవాలను నేటి సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా మలుచుకొని, ప్రజలకు సేవలందిస్తున్నది. ప్రతి డీసీసీబీ బ్యాంకు కంప్యూటరైజ్డ్‌ చేయడంతో పాటు డిజిటల్‌ లావాదేవీలను నిర్వహిస్తున్నది. సొసైటీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తూ, ఆన్‌లైన్‌లో సేవలను అందిస్తోంది. 


సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితోనే..

ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ బ్యాంకు వెయ్యి కోట్ల టర్నోవర్‌ దాటి ముందుకు సాగి, 1200కోట్లకు చేరుకుంది. సీఎం కేసీఆర్‌ అందించిన ప్రోత్సాహంతో డీసీసీబీల బలోపేతానికి కారణమైంది. గతంలో డీసీసీబీ బ్యాంకులు పరిమిత రుణాలకు, కొద్ది మంది వ్యక్తులకే అందుబాటులో ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత డీసీసీబీ బ్యాంకుల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ బ్యాంకు చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి, సీఈవో శ్రీనివాస్‌ చేసిన కృషితో మెదక్‌ జిల్లా డీసీసీబీ చరిత్రలోనే రికార్డు స్థాయి లావాదేవీలతో అభివృద్ధిలో దూసుకుపోయింది.


logo