Oka Pathakam Prakaram Review | డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సాయిరామ్ శంకర్ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. 143, బంపరాఫర్ వంటి హిట్ చిత్రాలు అందుకున్నప్పటికీ హీరోగా మాత్రం ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాడు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ట్రై చేశాడు. ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత ఒక పథకం ప్రకారం అనే సినిమాతో మళ్లీ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమాపై ముందు పెద్దగా ఆఫర్ లేకపోయినప్పటికీ.. ప్రమోషన్స్ మాత్రం దీనిపై క్యురియాసిటీని పెంచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ ఎవరో ఇంటర్వెల్లోపు కనిపెడితే రూ.10 వేలు ఇస్తామని చెప్పడంతో ఈ సినిమాపై అందరి అటెన్షన్ పడేలా చేసింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మరీ ఆ క్యురియాసిటీతో ప్రేక్షకులను ఆకట్టుకుందా? సాయిరామ్ శంకర్ కమ్ బ్యాక్ ఇచ్చాడా? ఒకసారి చూద్దాం..
సిద్ధార్థ నీలకం ( సాయి రామ్ శంకర్ ) ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్. సిద్ధార్థ భార్య సీత ( ఆశిమా నర్వాల్) కనిపించకుండా పోయిన తర్వాత డ్రగ్స్‌కు బానిస అవుతాడు. ఈ క్రమంలో సిద్ధార్థతో తిరిగే దివ్య (బిగ్‌బాస్ భాను) క్రూరంగా హత్యకు గురవుతుంది. అయితే ఆమెను సిద్ధార్థనే చంపేశాడని ఏసీపీ రఘురాం (సముద్రఖని) అరెస్టు చేస్తాడు. కోర్టుకు కూడా తీసుకెళ్తాడు. అక్కడ లాయర్ చినబాబు (కళాభవన్ మణి) సైతం సిద్దార్థ్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఆ కేసులో తాను నిర్దోషిని అని స్వయంగా వాదించుకుని సిద్ధార్థ బయటకు వచ్చేస్తాడు.
అనంతరం దివ్య మర్డర్ కేసును ఏసీపీ రఘురామ్ నుంచి ఏసీపీ కవిత (శృతి సోది)కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత లాయర్ భార్య శ్వేతను కూడా ఎవరో దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఏసీపీ కవిత కూడా సిద్ధార్థ్‌నే అనుమానిస్తుంది. అసలు ఈ హత్యలు చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఈ కేసులో పథకం ప్రకారం సిద్ధార్థను ఇరికించాలని ఎందుకు అనుకున్నారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Oka Pathakam Prakaram
ఇటీవల కాలంలో మలయాళ సినిమాలు అందరికీ తెగ నచ్చేస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రావడంతో థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఒక మలయాళ దర్శకుడు తెలుగులో సినిమా చేస్తున్నాడనేసరికి కొన్ని అంచనాలు ఉంటాయి. పైగా తమ స్క్రీన్‌ప్లే, కథ మీద అంత నమ్మకం ఉందని చెప్పిన యూనిట్.. ఇంటర్వెల్లోగా విలన్‌ను కనిపెడితే రూ.10 వేలు ఇస్తామని ప్రకటించడం ఈ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. నిజంగానే ఈ సినిమాలో అంత ఆసక్తి ఉందా అని ఆసక్తి చూపించారు. దానికి తగ్గట్టే ఆ ఆసక్తిని డైరెక్టర్ వినోద్‌కుమార్ విజయన్ మెయింటైన్ చేశారు. అయితే ఫస్టాఫ్‌లో అసలు కథ మొదలవ్వడానికి కొంచెం టైమ్ పడుతుంది. కానీ ఆ తర్వాతే సినిమా మెల్లమెల్లగా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. ఇక విలన్ ఎవరై ఉంటారనేది కూడా గెస్ చేసే ఆలోచనలు ఆడియన్స్ మైండ్లోకి వచ్చేస్తాయి. కానీ అది ఎవరనేది మాత్రం తెలియకుండా.. చివరివరకు ఎంగేజింగ్‌గా నడిపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్లుగా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా విలన్ ఎవరు? హత్యలు చేస్తున్నది ఎవరనేది కనిపెట్టలేనట్టుగా కథనాన్ని నడిపించారు. అయితే హారర్ సినిమాలు ఎక్కువగా చూసే వారు మాత్రం విలన్‌ను ఎవరనేది కనిపెట్టేస్తారు. కానీ చాలామంది మాత్రం విలన్‌ను కనిపెట్టలేక తలలు పట్టుకుంటారు.
అయితే కథ మొత్తం కూడా అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. చాలా చోట్ల లాజిక్‌లు మిస్సయ్యాయి. క్లైమాక్స్ సాగదీతగా అనిపిస్తుంది. శునకాలతో ఉన్న ఫైట్ కూడా అంతగా ప్రభావం చూపించలేదు. ఓవరాల్‌గా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది.
Oka Pathakam Prakaram2
గోపీసుందర్ పాటలు, ఆర్ఆర్ ఫర్వాలేదు. కెమెరా పనితనం సహజంగా కనిపిస్తుంది. ఆర్ట్, ప్రొడక్షన్, యాక్షన్ కొరియోగ్రాఫీ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికొస్తే సాయి రామ్ శంకర్ డిఫరెంట్ షేడ్‌లో కనిపిస్తాడు. తనలోని నటనను మొత్తం ఈ సినిమాలో చూపించేశాడు. యాక్షన్, ఎమోషన్ అన్నింట్లో సాయి రామ్ శంకర్ మెప్పిస్తాడు. శృతి సోది, ఆశిమా నర్వాల్ పాత్ర పరిధి మేరకు నటించారు. సముద్రఖని పాత్రకు డబ్బింగ్ సెట్ కాలేదు.
మొత్తంగా.. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్‌ను వావ్ అనిపించేలా చేయకపోయినా.. పర్వాలేదనిపించేలా ఒక పథకం ప్రకారం సినిమా ఉంటుంది. రొటీన్ సినిమాని చూశామే అన్న ఫీలింగ్‌ను మాత్రం ఆడియెన్స్‌ను కలిగించకపోవడమే టీం సక్సెస్ అని చెప్పొచ్చు.