e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News Raja Raja Chora | ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ

Raja Raja Chora | ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ

ఇమేజ్‌ ఛట్రంలో బందీ కాకుండా హీరోగా ప్రతి సినిమాతో తనను తాను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవడానికి తపిస్తుంటారు శ్రీవిష్ణు ( Sri Vishnu ). కమర్షియల్‌ హంగులకు భిన్నంగా వాస్తవికత, మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తుంటారు. ఆ ఆలోచన విధానమే కథానాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. మరోసారి తనదైన శైలి అంశాలతో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’ ( Raja Raja Chora ).

ఈ సినిమా ద్వారా హసిత్‌ గోలి దర్శకుడిగా పరిచయం అయ్యారు. అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. టైటిల్‌, ప్రచార చిత్రాలతో ఈసినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. వైవిధ్యతను నమ్మి శ్రీవిష్ణు చేసిన ఈ చిత్రం ఆయనకు విజయాన్ని అందించిందా?లేదా? తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…

- Advertisement -

భాస్కర్‌(శ్రీవిష్ణు) జిరాక్స్‌ షాపులో పనిచేస్తుంటాడు. దొంగతనాలు చేయడం అతడి ప్రవృత్తి. అబద్దాలు చెబుతూ బతుకుంటాడు. భార్య విద్యతో(సునయన) పాటు ఓ కొడుకు ఉన్నా తనకు పెళ్లి కాలేదని అబద్దం చెప్పి సంజనను(మేఘా ఆకాష్‌) ప్రేమిస్తుంటాడు. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కంటాడు. అందుకు డబ్బు అవసరం కావడంతో చివరగా ఓ పెద్ద దొంగతనం చేయాలని భాస్కర్‌ అనుకుంటాడు. ఆ దొంగతనం చేస్తూ పోలీస్‌ అధికారి విలియం రెడ్డికి(రవిబాబు) పట్టుబడతాడు. ఆ తర్వాత భాస్కర్‌ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. భార్య విద్యను అతడు ద్వేషించడానికి కారణమేమిటి? భాస్కర్‌ చెప్పిన అబద్దాలను సంజన తెలుసుకుందా? భాస్కర్‌లో ఎలా పరివర్తన వచ్చిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

దొంగ అయిన వాల్మీకి రామాయాణాన్ని రాశాడనే అంశం నుంచి స్ఫూర్తి పొంది దర్శకుడు హసిత్‌ గోలి ఈ కథను రాసుకున్నారు. బతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసే ఓ యువకుడి జీవనగమనంలో ఎదురైన పరిస్థితులకు వినోదం, ఎమోషన్స్‌ను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. అబద్దాలు చెబుతూ బంధాలను నిలబెట్టడం సాధ్యం కాదనే సందేశాన్ని అంతర్లీనంగా చూపించారు.

కమర్షియాలిటీ కంటే వాస్తవికతకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు హసిత్‌ పాత్రల్ని, సన్నివేశాలన్నీ తీర్చిదిద్దారు. పురాణ వచనాలతో కథను ఆసక్తికరంగా మొదలుపెడుతూ శ్రీవిష్ణు పాత్రను పరిచయం చేసిన తీరు విభిన్నంగా ఉంటుంది. అవసరాల కోసం అతడు దొంగతనం చేసే సన్నివేశాలను వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. అబద్దాల చెప్పడం వల్ల భాస్కర్‌కు ఎదురయ్యే సన్నివేశాలు అలరిస్తాయి. ప్రథమార్థం మొత్తం సరదాగా సినిమాను నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని అందుకు భిన్నంగా తెరకెక్కించారు. పూర్తి ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. భార్యను ద్వేషించిన భాస్కర్‌ ఆమె మంచితనాన్ని ఎలా గుర్తించగలిగాడు? ప్రేమించిన సంజనకు తనకు పెళ్లైందనే నిజాన్ని ఎలా చెప్పాడనే అనే సన్నివేశాలను సెంటిమెంట్‌ ప్రధానంగా రూపొందించారు.

ప్రథమార్థంలో వేగంగా సాగిన ఈ సినిమాకు ద్వితీయార్థంలో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. విరామం తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ సాగదీసిన అనుభూతిని కలిగిస్తాయి. విలియమ్‌రెడ్డి, భాస్కర్‌ మధ్య సాగే దొంగ పోలీస్‌ డ్రామాలో ఉత్కంఠ లోపించింది. ప్రతి పాత్రకు ఓ ముగింపు ఇవ్వాలనే తాపత్రయం కారణంగా నిడివి ఎక్కువైంది.

కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే భర్తగా, దొంగగా, ప్రేమికుడిగా భిన్న కోణాల్లో శ్రీవిష్ణు కనిపించారు. తన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. చక్కటి ఎమోషన్స్‌ను పలికించారు. కథానాయికల్లో సునయన పాత్ర ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచింది. భర్త, కుటుంబ ప్రోత్సాహం లేకపోయినా కష్టపడి జీవితంలో పైకి రావాలని తపించే సగటు మహిళగా సహజ నటనతో ఆకట్టుకున్నది. మేఘాఆకాష్‌ కెరీర్‌లో తొలిసారి అభినయానికి ఆస్కారమున్న పాత్రలో కనిపించింది. విలన్‌గా రవిబాబు పాత్రను విభిన్నంగా దర్శకుడు తీర్చిదిద్దారు. గంగవ్వ, అజయ్‌ఘోష్‌తో పాటు ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యత ఉంటుంది.

దర్శకుడు హసిత్‌ కథను రాసుకున్న విధానం బాగుంది.కానీ దానిని తెరపై ఆవిష్కరించడంలో అనుభవలేమి కారణంగా తడబాటుకు లోనయ్యారు. వివేక్‌ సాగర్‌ సంగీతం, వేదరామన్‌ ఛాయాగ్రహణం చిన్న సినిమాకు ప్రాణంపోశాయి.

రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్ములాకు భిన్నంగా రూపొందిన చిత్రమిది. నవ్యమైన కథ,కథనాలు, పాత్రలతో అలరిస్తుంది. మల్టీప్లెక్స్‌ ప్రేక్షకుల్ని మెప్పించే ఈ చిత్రం బీ, సీ వర్గాలకు చేరువ అవుతుందా?లేదా? అన్నదానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
రేటింగ్‌-2.75/5

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana