ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 24 : ఇబ్రహీంపట్నం సబ్‌డివిజన్‌కు ప్రభుత్వం కొత్తగా రెండు పోలీస్ స్టేషన్లను మంజూ రు చేసింది. ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయటం కోసం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇబ్రహీంపట్నంలో పెరిగిపోతున్న విద్యాసంస్థలు, ట్రాఫిక్ సమస్య, అక్రమ పార్కింగ్‌ల సమస్యతో పాటు విస్తరిస్తున్న కాలనీలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు. ఇటీవల ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఎట్టకేలకు ఆమోదించింది. ఇబ్రహీంపట్నంలో పెరిగిన ఇంజినీరింగ్ కళాశాలల నేపథ్యంలో తుర్కయాంజాల్, బొంగ్లూరు, మంగల్‌పల్లి, శేరిగూడ, అంబేద్కర్ చౌరస్తా, మంచాలరోడ్డులో ఉదయం, సాయం త్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు సాగర్హ్రదారిపై ఎక్కడికక్కడే అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు జఠిలమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయటం వల్ల సమస్యలన్నీ తగ్గిపోతాయని ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలోని మేడిపల్లి సమీపంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫార్మాసిటీని ఏర్పాటు చేసింది. ఫార్మాసిటీ ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు రానున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో పెట్టుబడులకోసం ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకూడదనే మేడిపల్లిలో కొత్తగా ఫార్మా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ముందుగా కందుకూరు మండలంలోని మీరఖాన్పేట్లో ఫార్మా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ ఈ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మేడిపల్లిలోనే ఏర్పాటు చేయాలని గుర్తించారు. ఈ మేరకు యాచారం పోలీసులు శనివారం మేడిపల్లిలో స్థల పరిశీలన కూడా జరిపారు. ఫార్మాసిటీ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలను దృష్టిలో ఉంచుకుని మేడిపల్లిలో ఏర్పాటు చేస్తేనే అందరికి అనుకూలంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఇబ్రహీంపట్నం సబ్‌డివిజన్‌లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మరో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావటంతో పోలీసుస్టేషన్ల సంఖ్య పెరుగనుంది.