లీటర్ కూల్‌డ్రింక్ తాగినాక బాటిల్‌ను ఏం చేస్తారని ఎవరినైనా ప్రశ్నిస్తే.. నీళ్ల కోసం ఉపయోగిస్తామనో లేదా బయట పడేస్తామనో సమాధానం వస్తుంది.ప్లాస్టిక్ బకెట్ పాతబడి విరిగిపోయాక ఏం చేస్తారని ఎవరైనా అడిగితే.. బయట పడేస్తామనే జవాబు వస్తుంది. యూజ్ అండ్ త్రో గ్లాసుల్లో నీళ్లు తాగాక ఏం చేస్తారు అని ఎవరైనా అడిగితే.. చెత్తబుట్టలో పడేస్తామని ఠక్కున చెప్పేస్తారు..
– పెద్దఅంబర్‌పేట, జూలై 5
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారం పరిధి జీవీఆర్ కాలనీలో నివసించే కొల్లు రమేశ్‌రెడ్డి, సరిత దంపతులను ఇవే ప్రశ్నలు వేస్తే.. అరక్షణం కూడా ఆలోచించకుండానే పడేసే ప్రసక్తే లేదని సమాధానం వస్తుంది. మరి ఇంకేం చేస్తారని అడిగితే ‘మొక్కలు పెంచుతాం’ అని చెప్పేస్తారు. మొక్కల పెంపకం అంటే వీరికి అమితాసక్తి. ఉండేది అద్దె ఇంట్లోనే అయినా.. మొక్కల పెంపకంపై ఉన్న ఇష్టాన్ని వదులుకోలేదు. గేటు లోపలికి అడుగు పెట్టింది మొదలు అంతా పచ్చదనమే కనిపిస్తుంది. ఓ వైపు తీగల జాతి మొక్కలు.. మరోవైపు కూరగాయలు ఇలా అంతా హరితమయమే.
ప్లాస్టిక్ గ్లాస్ మొదలు.. బకెట్ వరకు..
ఇంట్లో ఉపయోగించే ఏ వస్తువును కూడా వీరు బయటపడేయరు. యూజ్ అండ్ త్రో గ్లాసుల్లో సైతం ఏవో మొక్కలు పెంచుతారు. కూల్ డ్రింక్ బాటిళ్లను వివిధ డిజైన్లలో కత్తిరిస్తారు. లోపలికి గాలి వెళ్లేందుకు వీలుగా తయారుచేసి మొక్కలు వేస్తారు. ఐదు లీటర్లు, 14 లీటర్ల నూనె డబ్బాలను సైతం మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నారు. ఆన్లైన్లో ఏవైనా వస్తువును ఆర్డర్ చేసినప్పుడు కొన్నిసార్లు థర్మోకోల్ డబ్బాల్లో తీసుకొస్తారు. అలాంటి థర్మోకోల్ డబ్బాల్లో విత్తనాలు వేస్తున్నారు. విరిగిపోయిన బకెట్లు, స్నానపు టబ్బులను అందంగా తయారుచేసి పచ్చదనానికి చిరునామాగా మారుస్తున్నారు. మిద్దెపైకి వెళ్లే ప్రతి మెట్టుపై మొక్కలు పెంచుతున్న డబ్బాలే దర్శనమిస్తాయి. ఇంటి ఆవరణలోని చిన్నపాటి ఖాళీ స్థలంలో ఎన్నో తీగ మొక్కలను పెంచుతున్నారు.
కూరగాయలు ఇక్కడే..
మొదటి నుంచి మొక్కల అంటే చాలా ఇష్టం. అందుకే ఇంట్లోని ఏ వస్తువును కూడా వృథాగా పాడేయను. వాటిలో ఏ మొక్కలు పెంచితే బాగుంటుందనే విషయాన్ని ఆలోచిస్తుంటాను. ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు కూడా.. వాళ్లింట్లో పెంచుతున్న మొక్కలను ప్రత్యేకంగా చూస్తా. అవి మా ఇంట్లోనూ పెంచుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తా. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తా. పిల్లలను స్కూల్‌కు పంపేవరకు చాలా బిజీగా ఉంటాం. ఆ తర్వాత మొక్కలను చూసుకుంటా. రోజూ వంటకు అవసరమయ్యే చాలావరకు కూరగాయలు, ఆకుకూరలను ఇంట్లోనే పండిస్తున్నాం. రసాయన ఎరువులను వినియోగించం. దొండకాయ, బెండకాయ, టమాటాలను పెంచుతున్నాం. వీటితోపాటు కొన్నిసార్లు పలు ఆకుకూరలు, కొత్తిమీర, పుదీన వేస్తుంటాం. జామ చెట్టు కూడా పెంచాం. ఎండాకాలంలో కూడా ఇంటి ఆవరణ మొత్తం చల్లగా ఉంటుంది.
– కే సరిత, జీవీఆర్కాలనీ, తట్టిఅన్నారం