నందిగామ, నవంబర్ 30 : మండలంలోనే అతి పెద్ద గ్రామపంచాయతీ నందిగామ. అధిక జనాభా, అధిక విస్తీర్ణం కలిగి ఉండడంతో పాటు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు అనువైన గ్రామం. ఇండస్ట్రీయల్ జోన్ ఉండడం.. ఎన్‌హెచ్ 44 జాతీయ రహదారి ఉన్నందున నందిగామలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడి దారులు ముందుకొస్తున్నారు. దీంతో నందిగామ పరిశ్రమలకు నిలయంగా… ఉపాధికి కేంద్రంగా మారింది. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు సుమారు 50కి పైగా ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎస్ఎన్ ఫార్మ, క్రేడో ఫార్మ, పిత్తి ఇంజినీరింగ్ లిమిటెట్, హెచ్‌బీఎల్ లిమిటెడ్, కంసాన్, అలీన్ ఫార్మ, చాక్లెట్, బిస్కెట్, ప్లాస్టిక్, టెక్స్టైల్స్, హచరీస్, స్పంజ్ ఐరన్ వంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి. నందిగామ గ్రామంతోపాటు చుట్టు పక్కల గ్రామస్తులు, బీహార్, ఒడిశా, యూపీ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ వంటి రాష్ర్టాల నుంచి వేలాది మంది వలస కూలీలు వచ్చి పశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా వలస కార్మికులకు ఇండ్లు రెంటుకు ఇవ్వడం, కిరాణ షాపులకు గిరాకీ రావడం వల్ల పరోక్షంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నది..
నందిగామ మండల కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వలసలు పొవాల్సిన పరిస్థితి తప్పింది. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లోనే వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
– రాంబాబు, నందిగామ గ్రామం
స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి..
స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. కొన్ని పరిశ్రమల్లో స్థానికులైన చదువుకున్న యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వని పరిశ్రమలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– దార సురేశ్, నందిగామ