అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రజా జీవనాన్ని సుఖమయం చేస్తున్నది. ఇదివరకు ఇల్లు నిర్మించాలంటే సిమెంటు, ఇటుక, ఇసుక అవసరం.. అంతేకాకుండా నెలల తరబడి సమయం పట్టేది. కానీ ప్రస్తుతం గంటల వ్యవధిలోనే సకల సౌకర్యాలతో పోర్టబుల్ క్యాబిన్ల నిర్మాణం జరుగుతున్నది. వీటిని ఎక్కడంటే అక్కడికి సులభంగా తరలించే వీలుంటుంది. దీంతో చాలామంది క్యాబిన్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ కార్యాలయాలు, ఫామ్‌హౌస్‌లు, కూరగాయలు, కిరాణా స్టాళ్లుగా ఏర్పాటు చేస్తున్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వీటిని నిర్మిస్తూ రూ.లక్ష నుంచి 4 లక్షల వరకు తీసుకుంటున్నారు తయారీదారులు.
ఎనుకటి పెద్దలు ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అనేవారు. కానీ నేడు సమాజంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నది. పెండ్లి మాట పక్కకు పెడితే మనోళ్లు గంటల వ్యవధిలోనే అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టి చూపిస్తున్నారు. గతంలో ప్రజలు తాటి కమ్మలు, కాష గడ్డితో గుడిసెలు, ప్లాస్టిక్ కవర్లతో గుడారాలు, రేకుల షెడ్లు వేసుకునేవారు. అనంతరం పెంకుటిండ్లు, డాబా ఇండ్ల్లు, అపార్ట్మెంట్లు వచ్చాయి. ఇండ్ల నిర్మాణం చేపట్టాలంటే నెలలు, సంవత్సరాల కాలం పడుతున్నది. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు నచ్చినట్లుగా గంటల్లో ఇండ్లు కట్టిస్తామంటున్నారు వ్యాపారులు. అవసరాలకు తగ్గట్లుగా ప్రతీది రెడిమేడ్ అవుతున్న తరుణంలో ఇండ్లు మాత్రం ఎందుకు రెడిమేడ్ కాకూడదు.. మీదే ఆలస్యం.. ఆర్డర్ ఇవ్వండి.. అలా వచ్చి మీరు కోరుకున్న చోట పెట్టేసి పోతామంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నగరం నుంచి మారుమూల పల్లెల వరకు అటవీ ప్రాంతాలే కాకుండా.. ఎత్తైన కొండలపై.. ఎక్కడ చూసినా పోర్టబుల్ క్యాబిన్స్ దర్శనమిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కార్యాలయాలు, ఇండ్లు, రెస్టారెంట్లు, ఫాంహౌస్లకనుగుణంగా రెడీ చేసి ఇచ్చేస్తున్నారు. వినియోగదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులువుగా తరలించడానికి ఈ ఇండ్లు ఎంతో వీలుంటాయి.
– ఆదిబట్ల, అక్టోబర్ 1
పాడైపోయిన.. పనికిరాని.. కంటెయినర్స్‌ను తీసుకొచ్చి కావాల్సిన సైజుల్లో ముందుగా వాటిని కట్ చేస్తారు. కావాల్సిన నమూనాల్లో అర్డర్ల ప్రకారం ఫాంహౌస్, బంక్ హౌస్, రియల్ ఎస్టేట్ కార్యాలయం, టాయిలెట్స్, సెక్యూరిటీ క్యాబిన్స్, కార్ పార్కింగ్ క్యాబిన్స్, ఇండ్లు, రెస్టారెంట్లు.. ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారికి అన్ని సౌకర్యాలతో.. అదీ గంటల వ్యవధిలో తయారుచేసి ఇస్తున్నారు.
క్యాబిన్స్ ధరను ఆయా ప్రాంతాలను బట్టి నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎఫ్టీకీ రూ.1000-1200 వరకు చార్జ్ చేస్తున్నారు. సాధారణంగా ఒక కార్యాలయం కావాలంటే రూ.4 లక్షల వరకు లభిస్తున్నది. తక్కువలో తక్కువ రూ.లక్షకు కూడా విక్రయిస్తున్నారు. తక్కువ సమయంలో నిర్మాణం పూర్త్తవుతుండడంతో కంటైనర్ క్యాబిన్ కల్చర్ విపరీతంగా పెరిగింది.
మనం ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న ఇంట్లో లేని సౌకర్యాలు వీటిలో ఉంటున్నాయి. ముఖ్యంగా ఏసీ, ఫ్యాన్, కిచెన్, బాత్రూం, విద్యుత్ సదుపాయం, బెడ్రూం, నీటి సౌకర్యమే కాకుండా సింటెక్స్ టైల్స్‌తోపాటు హంగులు అద్దుతున్నారు. విద్యుత్‌లేని ప్రాంతంలో సోలార్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్డర్ ఇవ్వగానే 15 నుంచి 30 రోజుల్లో ఎక్కడ కావాలంటే అక్కడికి స్వయంగా తయారీదారులే కంటైనర్‌ను తెచ్చి ఫిట్‌చేసి వెళ్తున్నారు.
క్యాబిన్ల తయారీ వ్యాపారం ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, శేరిగూడ, బొంగ్లూరు, మన్నెగూడ, యాచారం, మాల్, తుర్కయాంజాల్, తుక్కుగూడ ప్రాంతాల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. వినియోగదారులు అత్యధికంగా ఇక్కడి నుంచి కొనుగోలు చేసి తరలిస్తున్నారు. నెలలో మార్కెట్‌ను బట్టి 10 నుంచి 15 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
చిన్న ఇల్లు కట్టాలంటే దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. నేడు పోర్టబుల్ క్యాబిన్ల నిర్మాణానికి తక్కువ కాలం పడుతుండడంతో వాటివైపే మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారు దాదాపుగా కార్యాలయాల నిర్మాణం కోసం వీటినే వినియోగిస్తున్నారు. నగరాల్లో చిన్నచిన్న స్థలాల్లో టీ కొట్లు, హోటళ్లు, వాచ్మెన్లు ఉండటానికి చిన్నచిన్న రూంలు, గెస్ట్‌హౌస్‌ల ఏర్పాటుకు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.
– కోరె జంగయ్య, టీఆర్ఎస్ నాయకుడు, ఆదిబట్ల
లక్షల రూపాయలు వెచ్చించి ఇండ్లను నిర్మించుకునే స్థోమత లేని పేద కుటుంబాలకు తక్కువ ధరలో కేవలం లక్ష రూపాయలతో పోర్టబుల్ క్యాబిన్లు(ఇండ్లు) లభిస్తున్నాయి. రూ.నాలుగు లక్షలు చెల్లిస్తే బెడ్రూం, కిచెన్, హాల్, బాత్రూం సహా అన్ని ఏర్పాట్లతో అనుకున్న చోట ఎంత విస్తీర్ణంలో అంటే అంతలో ఇండ్లను నిర్మించి ఇస్తున్నారు. సింటెక్స్ ట్యాంక్, కరెంట్, ఫ్యాన్లు, ఇంటీరీయర్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా.. ఆకర్షణీయమైన రంగులతో అందుబాటులోకి తెస్తున్నారు. కరెంట్ సౌకర్యం అందుబాటులో లేనిచోట సోలార్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. కరెంట్ సౌకర్యం ఉన్నచోట కూడా సోలార్ సిస్టంను వాడుతున్నారు.
– కల్వకోలు రవీందర్‌రెడ్డి, కొంగరకలాన్
ఈ క్యాబిన్లను ఏ ప్రాంతంలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాంటి సౌకర్యంలేని చోట వీటిని చాలా మంది వినియోగించుకుంటున్నారు. దట్టమైన అడవుల్లోనూ వీటిని ఏర్పాటు చేసుకుని నివాసముంటున్నారంటే.. ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. క్యాబిన్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి వీలుండడంతో వీటివైపు మొగ్గు చూపుతున్నారు.
– పల్లె గోపాల్‌గౌడ్, ఆదిబట్ల మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు