కొడంగల్, ఏప్రిల్ 19 : నిప్పును నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదు. అసలే ఎండాకాలం.. మండుతున్న ఎండలు.. గ్రామాల్లో మరీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ అగ్నిమాపక శాఖ హెచ్చరిస్తున్నది. గోడ పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూనే మాక్ డ్రిల్స్ వంటివి నిర్వహిస్తూ చైతన్యవంతులను చేస్తున్నది. అగ్ని ఎన్నో విధాలా మనకు ఉపయోగపడుతున్నప్పటీకీ.. ఏమాత్రం పొరపాటు చేసినా ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీస్తుందన్నది అక్షర సత్యం. ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించి జాగ్రత్తలపై తీసుకోవాల్సిన చర్యలు.. ప్రమాదంలో ఉన్నవారిని ఏ విధంగా కాపాడాలో సిబ్బంది ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. దాంతోపాటు గోడ పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారంచేస్తూ..విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, మాక్ డ్రిల్స్ వంటి వాటిని నిర్వహిస్తున్నది.
వారోత్సవాల ఉద్దేశం
అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. అగ్నిప్రమాద సమయాల్లోనే కాకుండా వరదలు, రోడ్డు, రైలు, భూకంపాల వంటి ప్రమాదాల్లోనూ సంబంధిత శాఖ సేవలను అందిస్తున్నది. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణనష్టం జరగకుండా కాపాడడమే వీరి ప్రధాన కర్తవ్యం. ఏదైనా ప్రమాదం సంభవించినప్పడు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలి. పేరు, ఫోన్ నంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం వివరాలను సంబంధిత శాఖకు అందించాలి.
వంటింట్లో..
* వంటింటి కింద, పై భాగాల్లో గాలి వెలుతురు ఉండేటట్లు చూడాలి. చిన్నపిల్లలను వంట గదుల్లో వదలరాదు.
* చెడిపోయిన గ్యాస్ ట్యూబ్ స్థానంలో ఐఎస్ఐ మార్కుగల కొత్త ట్యూబ్‌ను వెంటనే మార్చాలి.
* ఎల్పీజీ వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ వాల్వ్ ఆఫ్ చేయాలి.
* గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ వాల్వ్ ఆఫ్ చేయాలి. ఆ సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్‌లు ఆన్, ఆఫ్ చేయవద్దు.
* మండుతున్న స్టవ్‌లో కిరోసిన్ పోయవద్దు.
* వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటి వాటిని ఉంచవద్దు. వంట చేస్తున్నప్పడు సరైన నూలు వస్ర్తాలు, అప్రాన్ గాని ధరించాలి.
ఇతరత్రా జాగ్రత్తలు..
* దుస్తులకు నిప్పంటుకుంటే పరుగెత్తొద్దు. నేలపై దొర్లాలి లేదా దుప్పటి చుట్టుకోవాలి,
* కాలిన శరీర భాగంపై చల్లని నీరు పోయాలి.
* పొగతో నిండుకున్న గదుల్లో మోచేతులు, మోకాళ్లపై పాకాలి. ముక్కుకు, నోటికి అడ్డంగా తడిగుడ్డ ఉంచి గాలి పీల్చడం ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ పీల్చకుండా ఆపవచ్చు. పౌరులు, సంబంధీకుల పాత్ర..
* విద్యుత్ ప్రమాదాలపై నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి.
* అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రథమంగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తరువాత సంబంధిత ఫైర్‌ను ఆర్పేందుకు ప్రయత్నించాలి.
* విద్యుత్ ప్రవాహ తీగలపై అత్యవసర పరిస్థితుల్లో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్స్ట్వింగిషర్ను ఉపయోగించాలి.
* అగ్ని ప్రమాద స్థలంలో అగ్ని ప్రమాద సిబ్బందికి సహకరించాలి.
అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులు
* ఇంటిలోని వస్తువులను అల్మారాలు, సెల్ఫుల్లో సక్రమంగా ఉంచాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి.
* చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, బాణాసంచా తదితర మండే వదార్థాలను అందుబాటులో ఉంచకుండా జాగ్రత్త వహించాలి.
* కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా పడేయవద్దు.
* ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలనే ఉపయోగించాలి.
* పాడైన వైర్లను వాడవద్దు. ఓవర్‌లోడ్ వేయవద్దు. ఎలక్ట్రికల్ సాకెట్లో దాని సామర్థ్యానికి తగిన ప్లగ్లనే వాడాలి.
* బెడ్‌పై పడుకొని పొగ తాగవద్దు, ఇంటి నుంచి ఎక్కువ రోజులు బయటకు వెళ్లినప్పుడు ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేసుకోవాలి.
* పటాకులు కాల్చేటప్పుడు నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించవద్దు.
* ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పేందుకు ఎల్లవేళలా నీటిని అందుబాటులో ఉంచాలి.
స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్‌లలో..
* స్కూల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్‌లో ఆర్సీసీ, కాంక్రీట్ శ్లాబులను మాత్రమే పైకప్పుగా వాడాలి.
* ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలి.
* సెల్లార్లలో అటోమేటిక్ స్ప్రింక్లర్స్‌ను ఉపయోగించాలి.
* అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు క్షేమంగా తప్పుకొనేందుకు సరైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని.. అదీ అందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలి.
* ఎలక్ట్రికల్ సామగ్రిని ఐఎస్ఐ మార్కు కలిగిన వాటిని మాత్రమే వాడాలి.
* మెట్లు, తలుపుల వద్ద ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి.
* తాటాకులు, గడ్డితో వేసిన పైకప్పును స్కూల్స్, హాస్పిటల్స్‌లో వాడవద్దు.
* ఎలక్ట్రికల్ షార్ట్‌సర్క్యూట్ జరిగినప్పుడు అగ్ని ప్రమాదం సంభవించకుండా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్‌ను అమర్చుకోవాలి.
* పరిసరాల శుభ్రతను పాటించాలి. అవరణల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలి.
* అగ్ని ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను ముందుగా గుర్తించి ఆ ప్రాంతాలను అగ్ని ప్రమాద రహితం చేయాలి.
* ఫ్లేమ్ ప్రూఫ్ మోటార్ స్పార్క్ స్విచ్‌లను మాత్రమే ఉపయోగించాలి.
* అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు సరిపడే నీటిని, ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ వస్తువులను నిబంధనల మేరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.
* ఫైర్ ఎనాక్యూయేషన్ డ్రిల్లును ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా ప్రాక్టీసు చేయాలి.
అగ్ని ప్రమాదాలను అరికడదాం
– పవన్‌కుమార్, ఇన్చార్జి అధికారి, అగ్నిమాపక కేంద్రం, కొడంగల్
అగ్ని ప్రమాదాలను అరికట్టి, జాతి సంపదను కాపాడేందుకు కృషి చేద్దాం. అగ్నిప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, గోదాముల్లో అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరిస్తున్నాం. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే 101కి సమాచారం అందించాలి. ముఖ్యంగా వంట గ్యాస్ లీకేజైతే వెంటనే రెగ్యులేటర్ వాల్వ్‌ను ఆఫ్ చేయండి. ఎల్పీజీ గ్యాస్‌కు సంబంధించిన ఎలాంటి సహాయానికైనా 1906కు కాల్ చేయండి. అగ్ని ప్రమాదాల సమయంలో పౌరులు సహకరించాలి.
విస్తృత అవగాహన.. మాక్ డ్రిల్..
– సయ్యద్ మతీన్, ఎల్ఎఫ్, అగ్నిమాపక కేంద్రం, కొడంగల్
అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పట్టణ కూడళ్లు, ప్రధాన వ్యాపార సముదాయాలు, స్కూల్స్, ఫ్యాక్టరీలు, గోదాంల వద్ద అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో మాక్ డ్రిల్ చేసి పూర్తి అవగాహన కల్పిస్తున్నాం.