అన్ని వర్గాల్లోనూ.. ఆనందమే..
‘అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోకు రూపకల్పన చేశారు. అన్నివర్గాలకు అగ్రతాంబూలమిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ప్రజా సంక్షేమం విషయంలో ఏమాత్రం రాజీపడకుండా గతంలో అమలవుతున్న పథకాలకు సంబంధించిన సాయం పెంచుతూనే..
- సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో
- అన్నదాతకు అన్నింటా అండ.. సంక్షేమానికి పెద్దపీట
- కేసీఆర్ బీమా..ప్రతి ఇంటికి ధీమా
- రైతుబంధు రూ.16వేలు, ఆసరా పింఛన్ రూ.5వేలకు పెంపు
- సౌభాగ్యలక్ష్మి, అన్నపూర్ణ వంటి కొత్త పథకాల ప్రకటన
- అన్ని వర్గాలకు అగ్రతాంబూలలిచ్చిన సీఎం కేసీఆర్
- సంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్ని వర్గాల ప్రజలు.. అంబరాన్నంటిన సంబురాలు
రంగారెడ్డి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : ‘అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోకు రూపకల్పన చేశారు. అన్నివర్గాలకు అగ్రతాంబూలమిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ప్రజా సంక్షేమం విషయంలో ఏమాత్రం రాజీపడకుండా గతంలో అమలవుతున్న పథకాలకు సంబంధించిన సాయం పెంచుతూనే.. మరికొన్ని కొత్త పథకాలను సీఎం ప్రకటించారు. ప్రతిపక్షాల ఊహలు.. అంచనాలకు అందని విధంగా ఇతర పార్టీల మ్యానిఫెస్టోను తలదన్నేలా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను చూసి రంగారెడ్డి జిల్లాలోని సబ్బండ వర్గాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలతోపాటు, మ్యానిఫెస్టోలో లేని అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పుట్టిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.’
ఆడపడుచులు హ్యాపీ..
ప్రస్తుత మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేయడంపై ఆడపడుచులు హ్యాపీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.200 ఉన్న ఆసరా ఫించన్‌ను రూ.వెయ్యికి పెంచి, 2018లో 2,016కు పెంచి సీఎం కేసీఆర్ అమలు చేస్తూ వస్తున్నారు. అదే విధంగా దివ్యాంగుల పింఛన్‌ను రూ.1,500 నుంచి పెంచుతూ వచ్చి ప్రస్తుతం రూ.4,016లు అందజేస్తున్నారు. ఒంటరి మహిళలకు రూ.2,016 పెన్షన్‌ను ఇస్తున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు సీఎం కేసీఆర్‌పై ఆది నుంచీ ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై ఏటా రూ.500చొప్పున పెంచి రూ.5,016కు, దివ్యాంగుల ఫించన్‌ను ఐదేండ్లలో రూ.6,016కు పెంచుతామని ప్రకటించి మరోసారి ఆసరా లబ్ధిదారుల మనసును సీఎం కేసీఆర్ దోచుకున్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద పేద మహిళలకు రూ.3వేల చొప్పున జీవన భృతి, వంట గ్యాస్ సిలిండర్‌ను రూ.400కే అందజేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. సొంతలేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు, హైదరాబాద్ సిటీలో లక్ష కొత్త డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పంపిణీ చేస్తామని చెప్పడంతోపాటు సొంత జాగ ఉన్న ఇండ్లులేని పేదలకు రూ.3లక్షల ఆర్థికసాయం అందజేస్తామని వరాలు గుప్పించారు.
రైతుబంధు రూ.16వేలకు పెంపు..
2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని రైతుబంధును 2018 జూన్ వానకాలం సీజన్ నుంచి సీఎం కేసీఆర్ అమలు చేస్తూ వస్తున్నారు. తొలుత ఎకరానికి రూ.4వేల చొప్పున అందించిన సాయాన్ని ఆతర్వాత రూ.5వేలకు పెంచి ఏడాదికి రూ.10వేలను ఇస్తున్నారు. జిల్లాలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు లక్ష ఎకరాల్లో సాగైన పంటలు నేడు మూడింతలు పెరిగి రూ.4లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుత మ్యానిఫెస్టోలో రైతుబంధు సాయాన్ని వచ్చే ఏడు రూ.12వేలకు పెంచి ఆతర్వాత ఏటా వెయ్యి పెంపుతో ఐదేండ్లలో రూ.16వేల చొప్పున అందించనున్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
బీమాతో ప్రతి ఇంటికీ ధీమా..
ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ప్రభుత్వం బాధిత కుటుంబానికి రైతుబీమా పథకం కింద పది రోజుల వ్యవధిలోనే రూ.5లక్షల పరిహారాన్ని అందజేస్తున్నది. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకు ఈ పథకాన్ని వర్తింప జేసింది. ఇదే తరహాలో ప్రతి ఇంటికీ ధీమా కల్పించాలని సంకల్పించి సీఎం కేసీఆర్ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున లైఫ్ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించి చనిపోయిన పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి సాయం డబ్బులను అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ప్రీమియం సైతం ప్రభుత్వమే ఎల్ఐసీకి చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు రూ.5లక్షల గరిష్ఠ పరిమితి ఉన్న ఆరోగ్యశ్రీ సేవలను కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకం కింద రూ.15లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
మ్యానిఫెస్టోతో సంక్షేమ సౌభాగ్యం
- విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
రంగారెడ్డి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : గడపగడపకూ సంక్షేమ సౌభాగ్యం కల్పించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీశాయన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతులకు భరోసా కల్పించాయని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు ఆడబిడ్డల కండ్లల్లో ఆనందాన్ని నింపాయన్నారు. ఇంటింటా సంక్షేమం.. ఊరూరా సౌభాగ్యం పరిఢవిల్లాలని ఆసరా పింఛన్, రైతుబంధు పెంపు, సౌభాగ్యలక్ష్మి వంటి పథకాలను మ్యానిఫెస్టోలో రూపకల్పన చేశారని అన్నారు. గతంలో మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేశారన్నారు. సీఎం కేసీఆర్ అంటే ప్రజలకు ఎనలేని నమ్మకమని, ప్రస్తుత మ్యానిఫెస్టోతో సకల జనులు సంబురపడుతున్నాయన్నారు.
సకల జనుల మ్యానిఫెస్టో
- రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
రంగారెడ్డి, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ) : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సకల జనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మహోన్నతమైన మ్యానిఫెస్టోను ప్రకటించారన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. అన్నపూర్ణ పథకంలో సన్న బియ్యం పంపిణీ, సౌభాగ్యలక్ష్మి, కేసీఆర్ బీమా, పింఛన్ల పెంపు వంటి అనేక పథకాలు సబ్బండ వర్గాలకు వరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు వైద్య సేవలు, రైతుబంధు సాయాన్ని రూ.16వేలకు పెంచడంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.16 లక్షలకు పెంచి ప్రజలపై తనకున్న ప్రేమను మరోమారు చాటుకున్నారని పేర్కొన్నారు.
ప్రతిక్షాలకు దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 15 : ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉన్నదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ఆదివారం ఇబ్రహీంపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేదలకు ఎంతో లబ్ధి చేకూరేలా ఉన్నదన్నారు. మ్యానిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధి ఓ వైపు, మహిళలు, వృద్ధులకు భరోసా ఇచ్చేలా ఉన్నదని చెప్పారు. మ్యానిఫెస్టో రూపలక్పన చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే విద్యుత్తు, తాగునీరు, నీటి పారుదల రంగాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, దళితబంధు, గృహలక్ష్మి వంటి పథకాలతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు పథకాలు తీసుకొస్తున్నారన్నారు. వంట గ్యాస్ సామాన్యులకు అందని ద్రాక్షలా మారిందని, సామాన్యులకు సైతం వంట గ్యాస్ అందించాలన్న ఉద్దేశంతో రూ.400కే అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సమావేశంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిది రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రవీందర్, శంకరయ్య, జంగయ్య, బుగ్గ రాములు, గట్క రాంరెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం
తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పదేండ్ల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని ఎన్నో హామీలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ప్రస్తుత మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉన్నది. గత 70 ఏండ్లలో ఎన్నోసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అప్పుడు చేయని అభివృద్ధి, సంక్షేమం.. ఇప్పుడు చేస్తామని చెబితే ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం. చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు ప్రజలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.
– కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
తెలంగాణ ప్రజలు మెచ్చేలా మ్యానిఫెస్టో
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలు నచ్చేలా.. మెచ్చేలా ఉన్నది. ఎన్నికల హామీలను చూసి ప్రతిపక్షాలకు చెమటలు పడుతున్నాయి. రైతుబంధు, ఆసర పింఛన్, కల్యాణలక్ష్మి వంటి పథకాలకు డబ్బులు పెంచడం పేదలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆరోగ్యశ్రీ నిధులు పెంచడం, పేద మహిళలకు 3 వేల పింఛన్ ఇస్తామని చెప్పడం మంచి నిర్ణయం. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
– వై. అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే, షాద్‌నగర్ నియోజకవర్గం
సబ్బండ వర్గాలకు ఉపయోగకరంగా మ్యానిఫెస్టో
సబ్బండ వర్గాలకు ఉపయోగకరంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉన్నది. ప్రజల నిర్ణయాల మేరకే పథకాలు రూపొందించి దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపారు. తెలంగాణను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదు. మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్‌లో కుమ్ములాటాలు, బీజేపీలో కులాలు, మతాల పిచ్చి ఉంటుంది.
– జైపాల్ యాదవ్, ఎమ్మెల్యే, ఆమనగల్లు నియోజకవర్గం
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

