పెద్దేముల్ : మండల పరిధిలోని కందనెల్లి గ్రామంలో గ్రామ దేవత ఊరడమ్మ బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ దేవత ఊరడమ్మ బోనాల పండుగ జాతరలో భాగంగా గ్రామస్తులు పట్టు వస్త్రాలు ధరించి, పిండి వంటలు వండుకొని, ప్రత్యేక పూజలను పూర్తి చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి సహా పంక్తి భోజనాలు చేశారు. సాయంత్రం గ్రామానికి చెందిన మహిళలు ఇంటికో బోనాన్ని ప్రత్యేకంగా తయారు చేసుకొని, పిండి వంటలతో నైవేద్యాలను అమ్మవారికి బోనాలతో పాటు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు.
బోనాల పండుగలో భాగంగా పోతురాజుల విన్యాసాలు, ఏర్పులసాని భవిష్యవాణీ, శివసత్తుల పూనకాలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్రామ దేవత ఊరడమ్మ అమ్మవారు గ్రామాన్ని చల్లగా చూసి, ఊరువాడ సంతోషంగా ఉండేలా దీవించాలన్నారు. పాడి పంటలు సంమృద్ధిగా పండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలా చూడాలని గ్రామస్తులు అమ్మవారిని కోరుకొన్నారు. ఉత్సవాల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.