పెద్దేముల్ : మండల పరిధిలోని గాజీపూర్, గొట్లపల్లి గ్రామాల్లో గ్రామ దేవతలు బోనమ్మలకు గ్రామస్తులు గురువారం అంగరంగ వైభవంగా బోనాలు తీశారు. బోనమ్మ బోనాల పండుగలో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు ముగించుకొని పట్టు వస్త్రాలను ధరించి ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం గ్రామ మహిళలు యువతులు బోనమ్మ అమ్మవార్లకు ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను, నైవేద్యాలను సమర్పించి మొక్కులను చెల్లించుకొన్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. బోనమ్మ అమ్మవారు ఊరువాడ సల్లంగా చూడాలని, పాడి పంటలు సంమృద్ధిగా పండేలా అందరూ సంతోషంగా ఉండేలా చల్లగా దీవించాలని, ప్రతి ఒక్కరు వారి వారి కుటుంబాల్లో సంతోషంగా, ఆనందంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని మొక్కులు చెల్లించుకున్నారు.
బోనమ్మ జాతరలో బోనాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పునకాలు అందరిని ఆకట్టుకొన్నాయి. ఏర్పులసాని చెప్పిన భవిష్యవాణీని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.